స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతిఒక్కరూ వాట్సాప్ వాడుతారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో సెలబ్రిటీలు అయితే కచ్చితంగా వాడతారు. అయితే వాట్సాప్ వైపు చూడని ఓ సెలబ్రిటీ ఉన్నారని మీకు తెలుసా? అందులో ఆయన టాలీవుడ్‌కి చెందినవాడని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వార్త చదివేయండి మీకే తెలిసిపోతుంది… ఆశ్చర్యమూ వేస్తుంది. అన్నట్లు ఆయన కుర్రకారు పల్స్ పట్టిన దర్శకుడే. అవునా అంటారా. అందుకే కదా ఈ ఆశ్చర్యం. ‘హ్యాపీడేస్’ అంటూ యూత్ సినిమాతో తన సినీ పయనాన్ని పరుగులు పెట్టించారు శేఖర్ కమ్ముల.
అలాంటి ఆయనకే వాట్సాప్ లేదు అంటే మీరు నమ్ముతారా? నిజమే ఆయన వాట్సాప్ వాడరు. వాట్సాప్ వచ్చిన కొత్తలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు వాట్సాప్ వాడితే ఇబ్బంది, ప్రైవసీ అని మనం అనుకుంటున్నాం కదా. ఈ విషయాన్నిముందుగానే గ్రహించి, అందరి కంటే ముందే దానికి దూరం పెట్టారట. శేఖర్ కమ్ముల ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే ఫోన్ చేస్తారు, లేదంటే మెసేజ్ చేస్తారు. అంతేకానీ వాట్సాప్ మాత్రం వాడరు. ఈ విషయాన్ని చెబుతూ శేఖర్ కమ్ముల మరో విషయం కూడా చెప్పారట.
తన జన్మదినం నాడు వెంకటేశ్ తనకు వాట్సాప్‌లో మెసేజ్ చేశారని, నేను దానికి రిప్లై ఇవ్వలేదని బాధపడ్డారని, ఆఖరికి ఆయన వాట్సాప్ వాడరు అని రానా చెప్పారని, అప్పుడు వెంకటేశ్ కూల్ అయ్యారని చెప్పారు. ఇక్కడే అసలు మెలిక ఉంది. దాని బట్టే శేఖర్ కమ్ముల వాట్సాప్ విషయంలో అబద్దం చెప్పారని అనిపిస్తోంది. ఓ నెంబరు మీద వాట్సాప్ లేనప్పుడు దానికి ఎవరూ మెసేజ్ పంపలేరు. కేవలం వాట్సాప్‌లో చేరండి అని ఇన్వైట్ మాత్రమే చేయగలరు. మరి అలాంటప్పుడు వెంకటేశ్ ఎలా మెసేజ్ పంపగలిగారు. అయితే గతంలో వాడి… డిలీట్ చేయకుండా పక్కన పెట్టేసుండాలి. లేదంటే అబద్ధం చెప్పుండాలి. ఏది నిజమో మరి.