గతేడాది కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభించిన సమయంలో థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఏడాది రిలీజైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ సినిమాలు ప్రజల్లో థియేటర్ల విషయంలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేశాయి. వకీల్ సాబ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు రాలేదు. యూఎస్ లో వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో యూఎస్ బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నారు.
కరోనా భయం వల్ల, వకీల్ సాబ్ రిజల్ట్ వల్ల యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కొత్త సినిమాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలకు ఎక్కువగా ఆదాయం చేకూరే అవకాశం లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఆగిపోవడంతో వకీల్ సాబ్ మాత్రమే ఎక్కువ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే ఆక్యుపెన్సీ పడిపోవడంతో కలెక్షన్లు ఎక్కువగా రావడం లేదని సమాచారం.
తెలంగాణలో వకీల్ సాబ్ ప్రదర్శిస్తున్న థియేటర్లు మినహా మిగిలిన థియేటర్లు మూతబడ్డాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జూన్, జులై వరకు కరోనా ప్రభావం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. కరోనా ప్రభావం తగ్గితే మాత్రం లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య, నారప్ప సినిమాల కొత్త రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.