ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమైన శ్రీరామ్ వేణు ఆ సినిమాతో ప్రతిభ గల దర్శకునిగా పేరును సంపాదించుకున్నా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ కావడంతో శ్రీరామ్ వేణుకు కొన్నేళ్ల పాటు దర్శకునిగా అవకాశాలు రాలేదు. ఆ సినిమా తరువాత నాని నటించిన ఎంసీఏ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
మూడో సినిమాగా శ్రీరామ్ వేణు పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. అయితే వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్టైనా ఈ డైరెక్టర్ కు మాత్రం ఎలాంటి బహుమతులు దక్కలేదు. స్వయంగా శ్రీరామ్ వేణు ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
గతంలో సినిమాలు హిట్టైన సమయంలో హీరోలు, నిర్మాతలు దర్శకులకు విలువైన కార్లను, ఖరీదైన ఫ్లాట్లను బహుమతులుగా ఇచ్చారు. ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సక్సెస్ సాధించిన బుచ్చిబాబు సానాకు సైతం బెంజ్ కారు బహుమతిగా దక్కింది. మరి వకీల్ సాబ్ డైరెక్టర్ ప్రతిభను దిల్ రాజు లేదా పవన్ కళ్యాణ్ గుర్తించి శ్రీరామ్ వేణుకు ఏదైనా బహుమతిని ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో వకీల్ సాబ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా సక్సెస్ సాధించడం గమనార్హం.