దిల్ రాజుని టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని అంటుంటారు. ఎందుకంటే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లో 80 శాతం సక్సెస్ సాధించినవే. ఏ సినిమాకి ఎంత కెపాసిటీ ఉంది అనేది దిల్ రాజు చాలా వరకు కరెక్ట్ గా అంచనా వేస్తారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ఓ సినిమా హక్కులను కొనుగోలు చేశారు అంటే.. ఆ సినిమాపై హైప్ కూడా పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉండగా.. దిల్ రాజు తన సొంత బ్యానర్ లోనే కాకుండా వేరే నిర్మాతలతో కూడా కలిసి సినిమాలు నిర్మించారు. అలా ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి గతంలో ‘గగనం’ ‘మరో చరిత్ర’ అనే చిత్రాలు నిర్మించారు. ఈ రెండు సినిమాల ఆడలేదు. దీంతో ‘ఈ సినిమాలకు భారీగా నష్టపోయారా?’ అంటూ దిల్ రాజుకి ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన బదులిస్తూ..
“నిరంజన్ రెడ్డి నా కజిన్. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మొదలుపెట్టినప్పుడు నాతో కలిసి ‘గగనం’ ‘మరో చరిత్ర’ సినిమాలు నిర్మించాడు. అందులో ‘గగనం’ కి సేఫ్ అయిపోయాం. ‘మరో చరిత్ర’ మాత్రం భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ‘మరో చరిత్ర’ సినిమా షూటింగ్ మొదటి అమెరికాలో ప్లాన్ చేశాం. అప్పుడు కొంతమందికే వీసాలు వచ్చాయి. వచ్చిన వాళ్ళతో వెళ్లి షూటింగ్ చేశాం. మిగిలిన వాళ్లకు తర్వాత వస్తాయి అనుకుంటే.. రాలేదు.
దీంతో మళ్ళీ ఇండియాకు వచ్చి.. దుబాయ్ కి ఆ షెడ్యూల్ ని మార్చాము. అక్కడ మళ్ళీ మొదటి నుండీ చిత్రీకరించాం. అలా రూ.5 కోట్లతో తీద్దాం అనుకున్న ఆ సినిమాకు రూ.10 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక రిలీజ్ తర్వాత టాక్ కూడా మంచిగా రాకపోవడంతో మాకు నష్టాలు వచ్చాయి” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.