ఎవడితోనైనా పెట్టుకో మంచి స్నేహితులు ఉన్నవాళ్లతో అస్సలు పెట్టుకోకు అంటుంటారు పెద్దలు. అంటే కష్టంలో, ఆనందంలో.. ఇలా ఎలాంటి పరిస్థితల్లోనైనా ‘నేనున్నా’ అంటూ వచ్చే స్నేహితులున్నాడు చాలా గొప్పోడు అని అర్థం. ఇలాంటి వాడిని మీరెప్పుడూ చూడకపోయుంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజును చూడండి మీకే తెలిసిపోతుంది. అదేంటి అంటారా? సంక్రాంతికి ‘వరిసు’ / ‘వారసుడు’ రిలీజ్ విషయంలో ఆయనను కొంతమంది టార్గెట్ చేస్తే.. ఆయన మారు మాట్లాడకుండా తనకు కావాల్సిన పని జరిగేలా చేసుకున్నారు. దీని వెనుక ఆయన స్నేహితులు ఉన్నారు అనేది పాయింట్.
ప్రముఖ నిర్మాత దిల్ రాజుని టార్గెట్ చేస్తూ మొన్నటివరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హడావుడి చేసిన విషయం తెలిసిందే.. సంక్రాంతి సమయంలో తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వండి అంటూ మండలి ఓ నోట్ రిలీజ్ చేసింది. అంటే.. ‘వీర సింహ రెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’కి ప్రయారిటీ ఇవ్వడండి.. ‘వారసుడు’ సినిమాకు వద్దని ఇన్‌డైరెక్ట్‌గా మండలి ఆ లేఖలో పేర్కొంది. దీంతో దిల్ రాజుకు ఇబ్బంది అని కొంతమంది అనుకున్నారు. అయితే అలా వదిలేస్తే ఆయన దిల్ రాజు ఎందుకు అవుతారు.
ఆయన ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. కానీ ఆయనకు మద్దతుగా టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు అయితే అశ్వనీదత్, అల్లు అరవింద్ మాట్లాడారు. దీంతో మండలి వర్సెస్ సీనియర్ నిర్మాతలుగా మారింది పరిస్థితి. ఏమైందో, ఏం మాట్లాడుకున్నారో ఏమో.. ఇప్పుడు ‘వారసుడు’ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చేసినట్లున్నారు. అందుకే ఆ సినిమా డేట్‌ను దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. దీంతో నిర్మాతల మండలి సీరియస్ నిర్ణయం తుస్ మంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ‘వారసుడు’ సినిమాకు తెలుగులో మంచి థియేటర్లు దొరుకుతాయి. నిర్మాతల మండలి గప్‌చుప్ కాబట్టి.. ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. థియేటర్లు అయితే దొరుకుతాయి కానీ.. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలకు ఇలాంటి పరిస్థితి రావడం మాత్రం ఎవరూ ఊహించని పరిణామం అనే చెప్పాలి.