డైరక్టర్ బాబీ పవర్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశాన్ని బాబీ పట్టేసారు. అయితే పవన్, బాబీ కాంబినేషన్లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ నిరాశ పరిచింది. మళ్ళీ డైరక్టర్ గా బాబీ కి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసమే చాలా కష్టపడి జై లవకుశ కథ రాసుకున్నారు. రాసుకోవడమే కాదు .. ఈ కథని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించారు. ఈ రోజు విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ కథ రవితేజ కోసం రాసుకున్నదని, అతను వద్దనే సరికి ఎన్టీఆర్ కి చెప్పారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దానిపై బాబీ స్పందించారు.
“రవితేజ కోసం అనుకున్నది వేరే కథ, వేరే కారణాల వల్ల ఆ సినిమా మొదలవలేదు” అని బాబీ స్పష్టం చేశారు. “ఎన్టీఆర్ కోసం ఫ్రెష్ గా ‘జై లవకుశ’ కథ రాశాను. ఈ కథ రాస్తున్నపుడు నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కథ రెడీ అయ్యాక కొరటాల శివను సంప్రదించి ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడా? లేదా? అని తెలుసుకుని.. ఆ తర్వాత ఎన్టీఆర్ కి కథ చెప్పాను” అని వివరించారు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’కథను తన కంటే ఎక్కువగా నమ్మి కష్టపడ్డారని వెల్లడించారు. మూడు పాత్రల్లో చక్కని నటన ప్రదర్శించి ఎన్టీఆర్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.