స్టార్ హీరోలతో రెండు వరుస విజయాలు అందుకున్నారు.. ఇప్పుడు మరో స్టార్ హీరోకి సినిమా చేస్తున్నారు. ప్రచార చిత్రాలు అదిరిపోయాయి, ఇక సినిమా విజయం ఒక్కటే పెండింగ్ అనుకుంటూ వచ్చిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. తారక్ హీరోగా హరీశ్ శంకర్ (Harish Shankar) తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా ఫలితం తారక్ (Jr NTR) , హరీశ్ గుర్తుంచుకోదగ్గది కాదు. అభిమానులకు అయితే ఆ పేరు ఎత్తితేనే ఎందుకురాబాబూ ఆ సినిమా గురించి అనేంత చిరాకు వస్తుంది.
అలాంటి ఫలితం అందించిన సినిమా గురించి దర్శకుడు హరీశ్ శంకర్ ఇటీవల స్పందించారు. ఆయన దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమా ప్రచారంలో భాగంగా ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమా గురించి మాట్లాడారు. తారక్, హరీష్ కెరీర్‌లో పెద్ద డిజాస్టర్లలో ఇదకొటి. ఇక నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) భారీ నష్టాలు తెచ్చిన పెట్టిన సినిమా కూడా ఇదే కావొచ్చు. ఇంత నష్టానికి కారణమేంటి అని అడిగితే..
‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు సెకండాఫే సమస్య. సినిమా ఇంటర్వెట్‌కే మెయిన్ విలన్ చనిపోతాడు. దీంతో అక్కడికే సినిమా అయిపోయిందని ప్రేక్షకులు అనుకుంటారు. దీంతో సెకండాఫ్ మీద పెద్దగా ఆసక్తి చూపించరు. అలాగే సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదు అని తన సినిమా ఫలితంపై హరీశ్ పోస్ట్ మార్టం చేసుకున్నారు. అయితే తన కెరీర్లో అత్యంత కష్టపడి చేసిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ అని చెప్పారు హరీశ్.
‘మిరపకాయ్’ (Mirapakay) , ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాల తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని, హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశం తనకు కూడా ఉందని, అందుకే ఎంతో కష్టపడి పని చేశానని హరీశ్ చెప్పారు. అయితే తన కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదని అని అన్నారు. అయితే ఆ సినిమా ఫలితం విషయంలో ఎవరినీ నిందించని, అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ స్పష్టం చేశారు. అదన్నమాట ఆ సినిమా ఫలితం వెనుక పోస్ట్ మార్టం.