మాంచి జోరు మీదున్న సమయంలో ఒక్కసారిగా డౌన్ అయిపోయిన దర్శకుల జాబితా రాస్తే అందులో విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) పేరు కూడా ఉంటుంది. ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) , ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ (Malliswari) లాంటి సినిమాలతో అదిరిపోయే విజయాలు అందుకున్న ఆయన.. రచయిత త్రివిక్రమ్ (Trivikram) ఆయన నుండి విడిపోవడంతో సరైన సినిమాలు చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన తనయుడుతో ‘ఉషా పరిణయం’ అనే సినిమా చేశారు. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విలేకర్లతో మాట్లాడుతూ సినిమా గురించి, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమాజంలో ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు ఎక్కువయ్యాయి. దీనిని కొందరు ప్రేమోన్మాదం అని అంటున్నారు. అది కేవలం ఉన్మాదమే అని ఘాటుగా చెప్పారు. అసలు ప్రేమ పేరుతో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవాడు అసలు ప్రేమికుడే కాదు.. శాడిస్ట్. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ హింసాత్మకం కాదు. అలా ఉంటే అసలు అది ప్రేమే కాదు.
ఈ అంశాన్నే ‘ఉషా పరిణయం’ సినిమాతో చెబుతున్నాం అని తెలిపారు విజయ్ భాస్కర్. మా సినిమా ప్రేమకు నేనిచ్చే నిర్వచనం అని తెలిపారు. ఇక ఈ సినిమా నా కొడుకును దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ కాదు అని చెప్పారు. ఈ కథను ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించానని, ‘జిలేబి’ సినిమా చేశాక మా అబ్బాయి ‘నాకు సరిపోయే కథతో సినిమా చేయండ’ని అడిగితే ఈ కథ బాగుంటుంది అని చేశామని తెలిపారు.
‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) సినిమా సమయంలో తన్వీ ఆకాంక్షను బాలనటిగా తిరస్కరించానని, ఇప్పుడు ఆమెనే తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాను అని చెప్పారు విజయ్ భాస్కర్. ప్రేక్షకుల అభిరుచి మారింది, మారుతుంది అంటే ఒప్పుకోను. వందేళ్లు అయినా ప్రేక్షకుల అభిరుచి మారదు. వాళ్లను ఎంటర్‌టైన్ చేస్తే ఏ కథైనా, ఎలాంటి సినిమా అయినా చూస్తారు. ఇక ఇంతకుముందు ఎమోషన్స్ సున్నితంగా ఉండేవి. ఇప్పుడు ఓటీటీల ప్రభావం వల్ల ప్రేమకథల్లో ఆ సున్నితత్వం పోయింది అని కామెంట్ చేశారు విజయ్ భాస్కర్.