దర్శకుడు మారుతి చాలా తక్కువ సమయంలో సినిమాలు చేస్తుంటారు. ఎక్కువ మంది ఆర్టిస్ట్ లతో తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయగల సామర్ధ్యం అతడికి ఉంది. లాక్ డౌన్ సమయంలో చాలా ఫాస్ట్ గా ‘మంచి రోజులొచ్చాయి’ అనే సినిమాను తెరకెక్కించారు మారుతి. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ ఫ్లాప్ ప్రభావం మాత్రం మారుతిపై పడలేదు. గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమా సెట్స్ పై ఉండగానే..
ప్రభాస్ తో సినిమా చేసే ఆఫర్ వచ్చింది. ఇప్పుడు చిరంజీవితో కూడా సినిమా ఓకే చేయించుకున్నారు. అందుకే ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా రిజల్ట్ పై ఎలాంటి బెంగ పెట్టుకోలేదు మారుతి. పైగా ‘అదొక బబుల్ గమ్ లాంటి సినిమా’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ఓ పెద్ద సూపర్ మార్కెట్ కి వెళ్తే.. అక్కడ ఉంటాయి. ఆఖరిని బబుల్ గమ్ కూడా ఉంటుంది. ఇంత పెద్ద సూపర్ మార్కెట్ లో బబుల్ గమ్ అమ్మడమేంటి అంటామా..? లేదు కదా..
నేనూ అంతే. నా వరకు మంచిరోజులొచ్చాయి సినిమా ఓ బబుల్ గమ్ లాంటి సినిమా. నేను దాన్ని అమ్మాను. రూ.3 కోట్లతో ఆ సినిమా తీస్తే రూ.12 కోట్ల బిజినెస్ జరిగింది. లాక్ డౌన్ లో రెండొందల మందికి ఉపాధి కల్పించాం. మా వరకు ఆ సినిమా సక్సెస్ అయినట్లే’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మారుతి డైరెక్ట్ చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. మరి మారుతికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ తీసుకొస్తుందో చూడాలి!