గతకొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు, మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, అల్లు అర్జున్ ‘సరైనోడు’ సింగర్ జుబిన్ నౌటియల్ వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు.. కె.జి.ఎఫ్ తాతగా పాపులర్ అయిన సీనియర్ నటుడు కృష్ణ జి రావు నిన్న (డిసెంబర్ 7) మరణించారనే వార్త మర్చిపోకముందే..
ప్రముఖ తమిళ నటుడు శివ నారాయణ మూర్తి అనారోగ్యం కారణంగా కన్నుమూశారనే వార్తతో మరోసారి ఉలిక్కి పడింది చిత్ర పరిశ్రమ.. తాజాగా టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ రాజసింహ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. నంద్యాల నేషనల్ హైవే పై ఈ రోజు (డిసెంబర్ 8) తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న రాజసింహ.. ఒక వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టారు.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారమందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. 108 సాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో రాజసింహ ఎడమకాలు విరిగినట్లు సమాచారం. సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ వద్ద సహాయకుడిగా పలు సినిమాలకు పనిచేసిన రాజసింహ.. ‘టక్కరిదొంగ’, ‘నీస్నేహం’ వంటి కొన్ని చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు.. ఇప్పటి వరకు ఆయన 60 చిత్రాలకు రచయితగా పనిచేశారు.
గుణ శేఖర్ దర్శకత్వంలో, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ కి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్రంలో ‘గోన గన్నారెడ్డి’ గా అల్లు అర్జున్ ఇంపార్టెంట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసలో బన్నీ పలికిన డైలాగ్స్‌కి ఎంతో క్రేజ్ వచ్చింది.. ఆ డైలాగ్స్ రాసింది రాజసింహనే. రచయితగా కొనసాగుతూనే దర్శకుడిగా సందీప్ కిషన్, నిత్యా మీనన్ లతో ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమా చేశారు. ఈ ఫిలిం అనుకున్నంతగా ఆడకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి..