‘జై భీమ్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) . ఇప్పుడు ఆయన రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ‘వేట్టయాన్’ (Vettaiyan) అనే సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదలకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా తర్వాత జ్ఞానవేల్ చేసే కొత్త సినిమా ఏంటి అనే వివరాలను వెల్లడించారు. ఈసారి కూడా ఆయన వార్తల్లో నిలిచిన అంశాన్నే ఎంచుకున్నారు. ‘దోశ కింగ్’ (Dosa King) పేరుతో ఆయన ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు.
హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాను జంగ్లీ పిక్చర్స్ నిర్మించనుంది. ఇక సినిమా కథాంశం గురించి చూస్తే.. తమిళనాడులో దోశ కింగ్‌గా ప్రాచుర్యం పొందిన శరవణ భవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్ చేసిన ఓ హత్య నేపథ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. ఫిక్షనల్ క్రైమ్ డ్రామాగా సిద్ధం కానున్న ఈ సినిమాను దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ రిలీజ్ చేస్తారు అని చెప్పొచ్చు. శరవణ రాజగోపాల్ జాతకాల పిచ్చితో తన వద్ద పని చేసే ఓ అసిస్టెంట్ కూతురు జీవన జ్యోతిని మూడో భార్యగా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.
అయితే అప్పటికే ఆమెకు శాంతకుమార్‌తో పెళ్లవడంతో అతన్ని హత్య చేయించాడు. 2001లో బయటకు వచ్చిన ఈ వార్త, కేసు అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఈ కేసు విషయంలో శాంతకుమార్ భార్య జీవజ్యోతి చేసిన పోరాటం ఆధారంగానే సినిమా ఉండబోతోంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం జ్ఞానవేల్‌తోపాటు హేమంత్ కూడా పని చేస్తున్నారు.
‘సప్తసాగరాలు సైడ్ ఏ’, ‘సప్తసాగరాలు సైడ్ బి’ సినిమాల దర్శకుడే ఈ హేమంత్. ఆయన గతంలో శ్రీరామ్ రాఘవన్‌తో కలసి ‘అంధాధున్’ సినిమాను కూడా రాశారు. ఇప్పుడు ఆయనే ‘దోశ కింగ్’ (Dosa King) సినిమాను రాస్తున్నారు. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూను అనౌన్స్ చేస్తారు.