ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విక్రమన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో సూర్యవంశం తెలుగులో చెప్పవే చిరుగాలి, వసంతం సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమన్ 2014 సంవత్సరంలో నిన్నై తాతు యారో సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా తర్వాత సినిమా షూటింగ్ లకు, డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. అయితే విక్రమన్ భార్య తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. తమిళంలో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉండటం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.
విక్రమన్ (Director Vikraman) భార్య జయప్రియ ప్రస్తుతం తమిళ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి జయప్రియ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండటం గమనార్హం. తన అనారోగ్యం వల్లే భర్త సినిమాలకు దూరంగా ఉన్నాడని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. మొదట నాకు వెన్నునొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే సిటీ స్కాన్ చేసి క్యాన్సర్ లా ఉందని అన్నారని
బయాప్సీ చేయాలని చెప్పారని నా భర్త భయపడి ఆపరేషన్ వద్దని చెప్పగా నిజంగా క్యాన్సర్ అయితే కష్టమని భావించి నేను ఆపరేషన్ కు ఒప్పుకున్నానని ఆమె అన్నారు. ఆపరేషన్ జరిగిన పదిరోజుల తర్వాత అడుగు తీసి అడుగు వేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. మందులు వాడినా అనారోగ్యం నుంచి కోలుకోలేదని ఎప్పుడూ నాకు తోడుగా ఇద్దరు నర్సులు ఉంటారని జయప్రియ కామెంట్లు చేశారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి యూరిన్ బ్యాగ్ వాడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా భర్త నా గురించి కంగారు పడుతున్నారని జయప్రియ వెల్లడించారు. నా చికిత్స కోసం భర్త ఆస్తులన్నీ అమ్మేశారని ఆమె అన్నారు. సూర్యవంశం సినిమాకు సీక్వెల్ తీయాలని చాలామంది చెబుతున్నా నన్నీ పరిస్థితిలో వదిలేయడం ఇష్టం లేక ఆగిపోయారని జయప్రియ చెప్పుకొచ్చారు.