దువ్వాడ జగన్నాథం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. బన్నీ సైనికుడిగా కనిపించనున్న ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ సంగీత దర్శకద్వయం విశాల్ – శేఖర్ స్వరపరిచిన పాటలు మాత్రం అలరించలేకపోయాయి. విడుదలైన రెండు పాటలు సో..సో గా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే బన్నీ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు. అతన్ని నమ్మి డిస్టిబ్యూటర్స్ సినిమాలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా నా పేరు సూర్య నైజాం హక్కులను
ప్రసాద్ అనే డిస్ట్రిబ్యూటర్ 21.5 కోట్లకు కొనుగోలు చేశారని తెలిసింది. ఇప్పటికే స్పైడర్, అజ్ఞాతవాసి చిత్రాలను భారీ ధరలకు కొన్న నిర్మాత దిల్ రాజు ఇంకా కోలుకోలేదు. అటువంటి తప్పు మళ్ళీ ప్రసాద్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. అల్లు అర్జున్ సోలో గా వస్తుంటే ఓపెనింగ్స్ రూపంలో భారీగా దండుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. నా పేరు సూర్య రిలీజ్ అయ్యే రోజు ఏప్రిల్ 26 న మహేష్ బాబు భరత్ అనే నేను రిలీజ్ కానుంది. పోనీ ఆ తర్వాత వీకెండ్ మొత్త ఈ చిత్రాలు మాత్రమే ఉంటాయకుంటే అదీ లేదు. నెక్స్ట్ రోజే ( ఏప్రిల్ 27) రజినీకాంత్ కాలా రిలీజ్ కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో బన్నీని నమ్మి రిస్క్ చేయడం మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.