ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల దర్శకత్వానికి దూరంగా ఉంటూ వచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కొంత విరామం అనంతరం మలయాళంలో డెబ్యూ చేస్తూ తెరకెక్కించిన చిత్రం “డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్” (Dominic and the Ladies Purse). ఈ చిత్రాన్ని మమ్ముట్టి నిర్మిస్తూ టైటిల్ పాత్ర పోషించడం విశేషం. మరి మలయాళం డెబ్యూతో అయినా దర్శకుడిగా తన సత్తాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిరూపించుకున్నాడా లేదా అనేది చూద్దాం..!!
Dominic and the Ladies Purse Review
కథ: ఒక ఫేక్ సర్టిఫికెట్ కారణంగా పోలీస్ ఉద్యోగం కోల్పోయి.. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేసి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తుంటాడు సి.ఐ.డామినిక్ (మమ్ముట్టి), సాలరీ అవసరం లేని అసిస్టెంట్ విఘ్నేష్ (గోకుల్ సురేష్) దొరకడంతో అతడితో కలిసి కొన్ని బ్లాక్ మెయిలింగ్ కేసులు డీల్ చేస్తూ పబ్బం గడుపుతుంటాడు.
ఒకానొక సందర్భంలో.. తన ఇంటి ఓనర్ మాధురి (విజ్జీ వెంకటేష్) అడిగిందని.. హాస్పిటల్లో దొరికిన ఒక లేడీస్ పర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. ఆ పర్స్ ఓనర్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అని తెలుసుకోవడంతో తన పని అయిపోయింది అనుకుంటాడు డామినిక్. అయితే.. ఆమె 4 రోజులుగా కనిపించడం లేదని తెలియడంతో.. ఆమె ఎలా అదృశ్యమైంది అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన డామినిక్ కి.. నందిత (సుస్మిత భట్) ఓ అర్థం కానీ ప్రశ్నలా మిగిలిపోతుంది.
అసలు నందిత ఎవరు? పూజ ఏమైంది? డామినిక్ కి ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలు ఏమిటి? లేడీస్ పర్స్ కేసును ఏ విధంగా ఛేదించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్” (Dominic and the Ladies Purse) కథాంశం.
నటీనటుల పనితీరు: మాములుగా సినిమాల్లో మమ్ముట్టి ఉన్నాడు అంటే.. మరో అరిస్ట్ అంతగా ఎలివేట్ అవ్వరు. అలాంటిది.. మమ్ముట్టి సైతం మరుగునపడేలా చేసిన స్క్రీన్ ప్రెజన్స్ సుస్మిత భట్ సొంతం. ఆమె ఈ చిత్రంలో పోషించిన నందిత అనే క్యారెక్టర్ సినిమాలో ఎంత కీలకం అనేది సినిమా చూసాక అర్థమవుతుంది. అయితే.. ఆ పాత్రలోని భిన్నమైన షేడ్స్ ను సుస్మిత తన కళ్లతో, హావభావాలతో ఎలివేట్ చేసిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది.
మమ్ముట్టి టైమింగ్ ఈ సినిమాలో కీలకాంశంగా మారింది. ఆయన వయసుకి తగ్గ పాత్ర ఇది. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. ఫైట్స్ కూడా చాలా సింపుల్ గా డిజైన్ చేయడంతో మమ్ముట్టి ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండాపోయింది.
హౌస్ ఓనర్ గా విజ్జీ వెంకటేష్, అసిస్టెంట్ గా గోకుల్ సురేష్ చక్కని నటనతో పాత్రల్లో ఒదిగిపోయారు. చాన్నాళ్ల తర్వాత వినీత్ ను తెరపై చూడడం మంచి అనుభూతిని ఇచ్చింది. అయితే.. అతడి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం గమనార్హం.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా గౌతమ్ మీనన్ సినిమాల్లో మాములుగానే కాస్త ల్యాగ్ ఉంటుంది. ఇక మలయాళం సినిమా కావడంతో ఇంకాస్త ల్యాగాడు. అయితే.. ఈ సినిమా కథ వేరే రచయిత అందించడంతో కథనంలో గౌతమ్ మార్క్ మిస్ అయ్యింది కానీ.. క్లైమాక్స్ లో చిన్నపాటి పోరాట సన్నివేశాన్ని.. నాట్యంతో కంపేర్ చేస్తూ తెరకెక్కించిన విధానంలో మాత్రం గౌతమ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. అయితే.. మమ్ముట్టి క్యారెక్టరైజేషన్ కి వచ్చేసరికి వంశీ గారి “డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్” ఛాయలు ఎక్కువగా కనిపించాయి.
గౌతమ్ మీనన్ కి ఇది పూర్తిస్థాయి కమ్ బ్యాక్ సినిమా కాకపోయినప్పటికీ.. అతడిలోని ఫిలిం మేకర్ ఇంకా సజీవంగానే ఉన్నాడనే విషయాన్ని అందరికీ గుర్తుచేసిన సినిమా ఇది. ఎడిటింగ్, కలరింగ్, డి.ఐ వంటి టెక్నికల్ అంశాల్లో చిన్నపాటి లోపాలు కనిపించాయి. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఆ మైనస్ పాయింట్స్ ను కవర్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. దర్బుక శివ పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
విశ్లేషణ: ఈ తరహా థ్రిల్లర్స్ లో స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకం. నీరజ్, సూరజ్ లతో కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమకూర్చిన కథనంలో వేగం, అతిశయం లోపించాయి. ట్విస్ట్ ను రివీల్ చేయడానికి ముందే ఆడియన్స్ గెస్ చేసేస్తారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే కచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ అయ్యుండేది. అయితే.. మేకింగ్ స్టైల్, మమ్ముట్టి టైమింగ్, సుస్మిత భట్ నటన కోసం “డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్”ను కచ్చితంగా ఒకసారి థియేటర్లలో చూడవచ్చు.
ఫోకస్ పాయింట్: గౌతమ్ మార్క్ ల్యాగుడుతో ఓ మోస్తరుగా అలరించిన సస్పెన్స్ థ్రిల్లర్!
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus