Drushyam2 Review : దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మలయాళంలో రూపొంది.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేకై ఘన విజయం సొంతం చేసుకున్న చిత్రం “దృశ్యం”. ఈ సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ థ్రిల్లర్ సెకండ్ పార్ట్ మొన్నామధ్య విడుదలై ఒటీటీలో సంచనల విజయం సాధించిన వెంటనే.. తెలుగు రీమేక్ షూటింగ్ మొదలెట్టారు. తొలుత థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రయత్నించారు కానీ.. ఎందుకొచ్చిన రిస్క్ అని అమెజాన్ లో విడుదల చేశారు. మరి ఈ తెలుగు రీమేక్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: డిజిపి కొడుకు శవాన్ని పోలీస్ స్టేషన్ లో పాతి పెట్టి.. ఆ విషయాన్ని పోలీసులు పసిగట్టకుండా చేసి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు రాంబాబు (వెంకటేష్). ఆ శవం బయటపడే సందర్భం నుంచి మొదలవుతుంది “దృశ్యం 2”. ఈసారి పోలీస్ యంత్రాంగం మాత్రమే కాదు రాజవరం గ్రామం మొత్తం రాంబాబు మీద అసూయతో ఉంటుంది. దాంతో రాంబాబు & ఫ్యామిలీకి ఈ కేస్ నుంచి బయటపడడం మరింత కష్టమవుతుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కేస్ ఓపెన్ అవుతుంది. ఈసారి రాంబాబు పోలీసులను ఎలా బురిడీ కొట్టిందిచాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు వరుణ్ శవాన్ని ఏం చేసాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: సాధారణంగా ఆల్రెడీ 40% జనాలు చూసేసిన సినిమా రీమేక్ లో నటించడం అనేది చాలా పెద్ద రిస్క్. ముఖ్యంగా ఆ పాత్రలోని ఎమోషన్స్ & డెప్త్ ను తన హావభావాలతో రీక్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడే సీనియర్ యాక్టర్ వెంకటేష్ నట విశ్వరూపం కనబడింది. గుండెల్లో అగ్ని పర్వతాన్ని పెట్టుకొని.. పైకి మంచు కొండలా కనిపించే ఓ సగటు తండ్రిగా ఆయన అభినయం అద్భుతం. ఈ పాత్రను తెలుగులో ఆయన రేంజ్ లో మరెవరూ చేయలేరు.

వెంకటేష్ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకున్న నటి నదియా. కొడుకును కోల్పోయిన తల్లిగా, ఈగోయిస్టిక్ పోలీస్ గా అదరగొట్టింది. చాన్నాళ్ల తర్వాత సత్యం రాజేష్ కి మంచి రోల్ దొరికింది. సంపత్, తనికెళ్ళ భరణిలు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రతిభను ముందుగా మెచ్చుకోవాలి. ఈయన నిజంగానే శవాల్ని దాచిపెట్టడంలో పీజీ చేసాడేమో అనే స్థాయిలో ఉంటాయి ఈయన కథలు-కథనాలు. ఆల్రెడీ తాను మలయాళంలో తీసిన అదే కథను, అదే సస్పెన్స్ ను మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. దాన్ని సక్సెస్ ఫుల్ గా సాధించాడు జీతూ. సినిమా మొత్తం తిరిగేది హీరో పాత్ర చుట్టే అయినప్పటికీ.. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కథనానికి చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా ఉంటుంది. సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చడంలో ఈ స్క్రీన్ ప్లే ముఖ్యపాత్ర పోషించిందని చెప్పాలి.

కథకుడిగా, దర్శకుడిగా జీతూ రీటెస్ట్ లో 100% మార్కులు సంపాదించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం మలయాళ వెర్షన్ రేంజ్ ఎమోషన్ ను రీక్రియేట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. నేటివిటీ అనేది సినిమాలో కనిపించకపోయినా.. వినిపించాలి. అది మాత్రం బాగా మిస్ అయ్యింది. ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

విశ్లేషణ: పొరపాటున మలయాళ ఒరిజినల్ వెర్షన్ చూసినప్పటికీ.. “దృశ్యం 2” కేవలం వెంకీ మామ యాక్టింగ్ కోసం మరోసారి చూసేయొచ్చు. అయితే.. ఒరిజినల్ వెర్షన్ చూడనివాళ్ళకి మాత్రం ఈ దృశ్యం 2 మాంచి థ్రిల్లర్. థియేటర్లో విడుదలై ఉంటే బాగుండేది. అమేజాన్ ప్రైమ్ కి మరో మంచి సినిమా దొరికిందని చెప్పాలి.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Share.