మాలీవుడ్‌లో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన విషయం ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’. ఆ మాటకొస్తే ఈ వ్యవహారం మొత్తం దక్షిణాదిని షేక్ చేసింది. సినిమా అనే కాకుండా ఇతర రంగాల్లోనూ దీని ఎఫెక్ట్ ఉంది. అయితే ఎప్పుడూ జరిగినట్లే ఎక్కువగా సినిమా రంగం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు అగ్ర హీరోల పేర్లు ఈ ఆపరేషన్ నుమ్‌ఖోర్‌లో బయటకు వచ్చాయి. వాళ్లే మలయాళ సినిమా పరిశ్రమ అగ్ర కథానాయకులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ వ్యవహారంలో దుల్కర్ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో ఊరట దక్కింది.
Dulquer Salmaan
దుల్కర్ లగ్జరీ కారు స్వాధీనం విషయంలో వారంలోగా నిర్ణయాన్ని తెలియజేయాలని కస్టమ్స్ విభాగాన్ని న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు దుల్కర్ సల్మాన్ కారు సంబంధిత డాక్యుమెంట్లను కస్టమ్స్ విభాగానికి అందజేశారు. దీంతో కొన్ని షరతులతో కారును విడుదల చేసేందుకు కస్టమ్స్ అధికారులు నిర్ణయించారు. ఆయా కార్ల విలువలో 20 శాతం మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీగా అందించిన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. దుల్కర్ కారుతోపాటు మరో వ్యక్తి కారును కూడా రిలీజ్ చేయనున్నారు.
భూటాన్ నుండి అక్రమంగా వాహనాలు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర ప్రముఖులు నివాసాల్లో ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో సోదాలు జరిపారు. అందులో 40కిపైగా కార్లను సీజ్ చేశారు. దీంతో తన కారును కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దుల్కర్ కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారం.. భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం వచ్చింది. వాటిని హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్‌లో కొన్ని ప్రదేశాలకు తరలించారట. సినీ, వ్యాపారవర్గాలు సహా కొందరు కొనుగోలుదారులకు విక్రయించారని సమాచారం.