తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్(55) ఈరోజు మృతి చెందారు. దీంతో అటు కొలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ విషాద ఛాయలు అల్లుకున్నాయి. కోలా భాస్కర్ చాలా కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చారట. గతకొద్ది రోజుల నుండీ కోలుకుంటున్నట్టు కనిపించినా.. మళ్ళీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన ఆయన..
ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచినట్టు సమాచారం. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘ఖుషి’ కి ఈయన పని చేసారు. దాంతో పాటు ‘7/జీ బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, … వంటి సూపర్ హిట్ చిత్రాలకు కూడా ఈయన ఎడిటర్‌గా పనిచేశారు. కోలా భాస్కర్ కు తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలకు కోలా భాస్కర్ పనిచేసారు. అంతేకాదు నిర్మాతగా కూడా మారి…
‘మాలై నేరతు మయక్కమ్’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అనే పేరుతో డబ్ అయ్యింది. సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా కోలా భాస్కర్ కొడుకు కోలా బాలకృష్ణ హీరోగా పరిచయమయ్యాడు. ఇక ‘కోలా భాస్కర్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు’ అని కొందరు సినీ సెలబ్రిటీలు చెప్పుకొస్తున్నారు.