మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాని మెగా అభిమానులు కానీ, నిర్మాత దిల్ రాజు (Dil Raju) కానీ ఎప్పటికీ మర్చిపోలేరు. అది ఎందుకో అందరికీ తెలుసు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దానికి మించి విపరీతమైన నెగిటివిటీ ఈ సినిమాపై ఏర్పడింది. మరోపక్క పైరసీ ఎఫెక్ట్. మార్నింగ్ షో అవ్వకుండానే హెచ్.డి ప్రింట్ అందుబాటులోకి వచ్చేసింది.
పండుగ సెలవుల వల్ల కొద్దిపాటి ఓపెనింగ్స్ వచ్చినా.. అవి చరణ్ ఇమేజ్ కి తగ్గ ఓపెనింగ్స్ కాదు. ఇదిలా ఉంటే.. సినిమా ఆడలేదు దానికి అందరూ నైతిక బాధ్యత వహించాలి. కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి వారానికే దర్శకుడు శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా చాలా ఉంది. ఫైనల్ వెర్షన్ తో తాను సంతృప్తి చెందలేదు అంటూ చెప్పి పెద్ద షాకిచ్చాడు. ఇక సంగీత దర్శకుడు తమన్ అయితే ‘గేమ్ ఛేంజర్’ పాటల చిత్రీకరణపై కంప్లైంట్ చేశాడు.
సరైన హుక్ స్టెప్ లేకపోవడం వల్లే.. పాటలు జనాల్లోకి వెళ్ళలేదు అని ఓ ఇంటర్వ్యూలో నోరు జారాడు. ఇలా ఎవరికి వారు సినిమా ఫలితంతో మాకు సంబంధం లేదు అన్నట్టు తోసిపుచ్చారు. షమీర్ అనే ఎడిటర్ ఇటీవల ఓ సందర్భంలో ‘గేమ్ ఛేంజర్’ రన్ టైం ఏడున్నర గంటలు వచ్చిందని చెప్పి పెద్ద షాకిచ్చాడు. శంకర్ 5 గంటలనే చెప్పాడు. ఈ వ్యక్తి మాత్రం ఏడున్నర గంటలు అనేసరికి పెద్ద షాకిచ్చినట్టు అయ్యింది.
తర్వాత దాన్ని 3 గంటలకు కుదించాడట. అటు తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల షమీర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. ఏదేమైనా 7 గంటలు పైగా నిడివి వచ్చిందంటే.. దర్శకుడు శంకర్ 3 సినిమాల బడ్జెట్ వేస్ట్ చేయించినట్టే కదా. పైగా ఎంతో మంది స్టార్స్ ఫుటేజీ కూడా ఎడిటింగ్లో పోయింది. నిర్మాతకి దీని వల్ల ఎన్ని కోట్లు నష్టం వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.