‘పుష్ప’ (Pushpa) సినిమాలో ‘పార్టీ లేదా పుష్ప’ అని అడుగుతుంటాడు భన్వర్ సింగ్ షెకావత్. ఎందుకు అడుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ పక్కనపెడితే.. ఇప్పుడు అదే డైలాగ్ పుష్పరాజ్ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే షెకావత్ ఉరఫ్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) చేసిన ఓ సినిమా భారీ విజయం అందుకుంది. వరుసగా రూ. వంద కోట్ల ఫీట్లు అందుకుంటున్న మలయాళం ఇండస్ట్రీ నుండి మరో రూ. 100 కోట్ల సినిమా అంటూ ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే ‘ఆవేశం’. ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది కూడా.
భారతీయ సినిమా పరిశ్రమలో మలయాళ ఫిలిం ఇండస్ట్రీ దూసుకెళ్తోంది అని చెప్పాలి. ఈ ఏడాది ‘భ్రమయుగం’, ‘ప్రేమలు’ (Premalu) , ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) సినిమాలు వచ్చి రికార్డు వసూళ్లు సాధించాయి. తాజాగా మరో రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అందులో ఒకటి ఫహాద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’. గత వారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు, బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆదివారానికి ఈ సినిమా రూ. 55 కోట్లకుపైగా వసూలు చేసిందని సమాచారం.
మరోవైపు ఫహాద్ ఫాజిల్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఆయన ఇటీవల నిర్మించిన ‘ప్రేమలు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఇప్పుడు నటించిన ‘ఆవేశం’ సినిమాకు ఆయన భార్య, నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) నిర్మాత. ఇక సినిమా కథ చూస్తే… కేరళ నుంచి ఉన్నత విద్య కోసం బెంగళూరు వెళ్లిన ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. ఎందుకు? ఎలా? ఆ తర్వాత ఏమైంది అనేదే కథ.
ఇలాంటి కథలు రావడం కొత్త కాదు కానీ… మలయాళంలో రావడం, ఆ కథలో ఫహాద్ ఫాజిల్ అదిరిపోయేలా నటించడం అనేదే ఇక్కడ ఆసక్తికర అంశం. ఆయన కోసమే కొంత మంది సినిమాకి వస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ లెక్కన పుష్ప రాజ్… షేకావత్ ని పార్టీ అడగొచ్చుగా!