ఎప్పుడూ చెప్పుకునే మాటే.. రాజకీయాలు, సినిమాలు మంచి స్నేహితులు అని. ఇటువైపు వాళ్లు అటు, అటువైపు వాళ్లు ఇటు వెళ్లడం మనం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కోలీవుడ్‌లో కనిపిస్తూ ఉంటుంది. తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వాళ్లలో సినిమా జనాలే ఎక్కువ. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే కూడా సినిమా మనిషి పెట్టిన పార్టీనే. మొన్నీమధ్య వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూడా దివంగత జయలలిత ఆధ్వర్యంలో నడిచిన పార్టీనే.
ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు చర్చ అంటే.. రెండేళ్ల తర్వాత తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు వస్తున్నాయి, రానున్నాయి కూడా. ఆ లెక్కన చూస్తుంటే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సినిమా యుద్ధం కనిపించబోతోంది అని అంచనా వేస్తున్నారు నిపుణులు. కావాలంటే మీరే చూడండి ఓవైపు కమల్ హాసన్ (Kamal Haasan) , మరోవైపు విజయ్ (Vijay) సిద్ధంగా ఉంటే… ఇప్పుడు విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తాను అని అంటున్నారు. ఇక ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులు సంగతి మీకు తెలిసిందే.
త్వరలో రాజకీయాల్లోకి వస్తారు అంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్న నటులు విజయ్, విశాల్ (Vishal) . అందుకే విజయ్ ఇప్పటికే పార్టీ అనౌన్స్‌మెంట్ చేసేయగా… ఇప్పుడు విశాల్ కూడా పొలిటికల్ అనౌన్స్‌మెంట్ గురించి స్పందించాడు. ‘‘త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా’’ అని చెప్పేశాడు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవు. వారికి సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నా అని అజెండా కూడా చెప్పేశాడు.
ఇక విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ అంటూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేశాడు. ఇక ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీ పెట్టి ఇప్పటికే ప్రజల్లో ఉన్నాడు కమల్. ఇది కాకుండా బీజేపీకి ఈ సారి రజనీకాంత్ (Rajinikanth) ప్రచారం చేస్తారనే ప్రచారమూ ఉంది. మరోవైపు రాధిక (Radhika) – శరత్ కుమార్ (Sarathkumar) ఆ పార్టీలోనే ఉన్నారు. కుష్బూ (Khushbu) కూడా పొలిటికల్ కెరీర్ రన్ చేస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈ చర్చే ఉండబోతోంది.