2024 సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు రెండే. అందులో ఒకటి మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అయితే.. ఇంకోటి తేజ సజ్జ (Teja Sajja) – ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man) చిత్రం.’హనుమాన్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. రామమందిర నిర్మాణం పూర్తయ్యి ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉండడం. టీజర్, ట్రైలర్లు జనాల దృష్టిని అమితంగా ఆకర్షించడం వంటివి వాటితో పాటు ‘మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు (Dil Raju) ఎక్కువ థియేటర్స్ లాగేసి ‘హనుమాన్’ కి థియేటర్లు లేకుండా చేసేస్తున్నాడు’ అనే టాపిక్ పై చాలా రచ్చ జరిగింది.
దీంతో దిల్ రాజు ఓ సినిమా ఈవెంట్లో తన కోపాన్ని ప్రదర్శించి ‘తాట తీస్తా’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ ‘హనుమాన్’ సినిమాని ‘మైత్రి’ సంస్థ నిర్మించింది. ‘మైత్రి’ కి దిల్ రాజుకి పడదు అనే ప్రచారం కూడా ఎప్పటినుంచో ఉంది. అందుకే ‘హనుమాన్’ కి దిల్ రాజు థియేటర్స్ లేకుండా చేసినట్టు అంతా అనుకున్నారు. సరే అది అయిపోయింది అనుకుంటే.. ఇప్పుడు మళ్ళీ ‘దిల్ రాజు వర్సెస్ ‘హనుమాన్’ ప్రొడ్యూసర్’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎందుకంటే.. దిల్ రాజు నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. మరోపక్క మలయాళంలో హిట్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummal Boys) ఏప్రిల్ 6 న ‘మైత్రి’ సంస్థ, హనుమాన్ నిర్మాత తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ మలయాళంలో హిట్ అయ్యింది కాబట్టి.. తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని భావించేవారు సంఖ్య కూడా ఉంది. అందుకే ‘దిల్ రాజుకి మళ్ళీ సమస్య తప్పేలా లేదు’ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.