సంక్రాంతి వార్, పొంగల్ పోరు, పెద్ద పండగ పంచాయితీ.. అంటూ గత కొన్ని రోజులుగా చాలా వార్తలొస్తున్నాయి. మీరు కూడా చదివే ఉంటారు. వాటన్నింటి అర్థం వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో జరుగుతున్న పంపకాల లెక్కలే. అంటే ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలి, ఇస్తారు అనేదే. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి ఆరు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో నాలుగు తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు.
అయితే మొదటి నాలుగుతోనే సమస్య. ఎందుకంటే అందులో రెండు స్టార్ హీరోల సినిమాలు, రెండు తమిళ స్టార్ల సినిమాలున్నాయి. అందరికీ తెలిసినట్లే వచ్చే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ అంటూ చిరంజీవి, బాలకృష్ణ వస్తున్నారు. వీరితోపాటు తమిళ నాట నుండి ‘వరిసు’/‘వారసుడు’ అంటూ విజయ్.. అజిత్ ‘తునివు’ / ‘తెగింపు’(?) సినిమాలు వస్తున్నాయి. దీంతో తెలుగు హీరోలు వర్సెస్ తమిళ హీరోలు అనే పరిస్థితి బాక్సాఫీసు దగ్గర ఏర్పడింది.
తెలుగు హీరోలను కాదని.. రీమేక్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడం సరికాదంటూ ఓ వర్గం అంటున్నారు. దీనిపై లేఖలు, సూచనలు కూడా ఛాంబర్, నిర్మాతల మండలి నుండి వచ్చాయి. అయితే అవేవీ ఆ డబ్బింగ్ సినిమాల నిర్మాతలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు స్టార్ హీరోల అభిమానుల్లో అసహనం రోజురోజుకు పెరుగుతోందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. ‘మాకేంటీ బాధ, మీరు మీరు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
‘సినిమాలు విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన మీరు.. ఇలా జనాల మీదకు వదిలేయడమేంటి’ అని కూడా అంటున్నారు. ఇంకొందరు అయితే ‘మా ఊళ్లో మంచి థియేటర్‌లో మా హీరో సినిమా పడాలి అనుకుంటాం. కానీ మీ అగ్రిమెంట్లతో మా హీరో సినిమాకు సరైన థియేటర్లు రావడం లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఈ గొడవలు లేకుండా అందరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే బెటర్.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!