‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ.. ఏదో ఒక కారణంతో సినిమా వాయిదా పడుతూనే ఉంది. మంచి ఫోర్స్ మీద షూటింగ్ మొదలవ్వడంతో అనుకున్న సమయానికి సినిమా వచ్చేస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే ‘విక్రమ్’ సినిమా ఘన విజయం ఈ సినిమా మీద ఎఫెక్ట్ చూపించింది. ఆ సినిమా హిట్ అయితే ఈ సినిమాకు ఏమైంది అనేగా ప్రశ్న. ఆ విజయం కమల్‌హాసన్‌ను తిరిగి యాక్టివేట్ చేసింది. దీంతో ఎప్పుడో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ను బయటకు తీశారు. దీంతో దర్శకుడు శంకర్ అటు వెళ్లాల్సి వచ్చింది.
దీంతో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం ఆన్ అండ్ ఆఫ్ అందుబాటులో ఉంటూ వచ్చారు. ఈలోపు రామ్‌చరన్ ‘ఆర్‌ఆర్ఆర్’ ఆస్కార్ ప్రచారం కోసం అటు వెళ్లిపోయారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందా అనుకుంటే ఉపాసన డెలివరీ డేట్ దగ్గరకు రావడంతో ఇటు వచ్చేశారు. దీంతో సినిమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అప్‌డేట్ ఒకటి చూచాయగా బయటకు వచ్చింది. సినిమా కొత్త షెడ్యూల్‌ను త్వరలో స్టార్ట్ చేస్తారని సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా సాగితే.. జులై 10 లేదా 11 నుండి సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ షెడ్యూల్ అంతా హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రతి సంవత్సరం సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి ఓ సినిమా ఉంటుంది. అది ఆయనకు అనవాయితీ మారిపోయింది. ఈసారి ‘గేమ్ ఛేంజర్’ ఆ టైమ్‌కి వచ్చేలా చూసుకుంటున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కష్టం అంటున్నారు.
పోనీ సమ్మర్‌కైనా వస్తారేమో అనుకుంటే… ఈ సినిమాను 2024 సమ్మర్‌కి తీసుకొస్తాం అని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏ దసరాకో, దీపావళితో తీసుకు రావాల్సి వస్తుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంత అడుగుతున్నా ఇవ్వకపోవడానికి ఇదే కారణం అంటున్నారు.