టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.53 ఏళ్ళకే ఆయన కన్నుమూశారు. కొన్నాళ్ళ నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన జూలై 18న శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చాలా సినిమాల్లో విలన్‌గా, కమెడియన్‌గా, సహాయ నటుడిగా అలరించిన ఫిష్ వెంకట్…. రెండు కిడ్నీలు పాడవడంతో కొన్నాళ్ల నుండి డయాలసిస్ చేయించుకుంటున్నారు.
తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అయ్యింది. ఓ దశలో కోలుకుంటాడు అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చేజారిపోయింది. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
అయితే ఫిష్ వెంకట్ చివరి రోజుల్లో సినిమాల్లో నటించలేకపోయారు. అతనికి చాలా ఆఫర్లు వచ్చినా చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆ సినిమా చేయగలిగే సామర్థ్యం ఉండి ఉంటే.. ఈరోజు ఆయన కుటుంబానికి అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనే చెప్పాలి. ఫిష్ వెంకట్ బిజీగా ఉండే రోజుల్లో.. ఒక్క రోజుకు రూ.30 వేలు చొప్పున పారితోషికం అందుకునే వారు. ఫిష్ వెంకట్ ఫేడౌట్ అయిన ఆర్టిస్ట్ కాదు. డిమాండ్ ఉన్న ఆర్టిస్టే. కానీ ఆరోగ్యం సహకరించలేదు.
అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా సెలబ్రిటీలు కష్టకాలంలో ఉన్నప్పుడు ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆదుకుంటుంది. కానీ ఫిష్ వెంకట్ మా సభ్యత్వం విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు కొంతమంది చెబుతున్నారు. అది కూడా ఫిష్ వెంకట్ కు పెద్ద మైనస్ అయ్యింది అని చెప్పాలి.