ఒకే సినిమా రెండు భాగాలుగా రావడం అనేది కొత్త విషయం కాదు. గతంలో ‘రక్తచరిత్ర’ ‘బాహుబలి’ వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘బయోపిక్’ కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పేర్లతో రిలీజ్ అయ్యాయి. అటు తర్వాత ‘కె.జి.ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’… చిత్రాలు కూడా రెండు భాగాలుగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే రెండు భాగాల ట్రెండ్ గట్టిగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. రెండు భాగాలుగా సినిమాలు తీర్చిదిద్దడానికి రెండు కారణాలు ఉండొచ్చు.
ఒకటి 3 గంటల్లో చెప్పలేని కథ కోసం, ఇంకోటి బడ్జెట్ ను రికవరీ చేసుకోవడం కోసం..! అయితే రెండు భాగాలుగా సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పడంలో రిస్క్ కూడా ఎక్కువే ఉంది. ఒకవేళ పార్ట్ 1 ఫెయిల్ అయితే పార్ట్ 2 పై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇలాంటి రిస్క్ ఉందని తెలిసినప్పటికీ ఎందుకో.. కొన్ని పెద్ద సినిమా యూనిట్లు తమ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించేస్తున్నారు. ఈ మధ్యనే ‘దేవర’ కూడా ఆ లిస్ట్ లో చేరింది.
దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు రామ్ చరణ్- శంకర్ ల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కూడా రెండు పార్టులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి.. ఏడాదిన్నర దాటింది. మొదట్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని మేకర్స్ అనుకోలేదు. కానీ బడ్జెట్ పెరిగిపోవడం, ఫుటేజ్ కూడా ఇప్పటికే నాలుగున్నర గంటలు రావడం, అన్నిటికీ మించి కథ కూడా పెద్దది కావడంతో మేకర్స్ ఈ రెండు పార్టుల ఆలోచనకి వచ్చేసినట్టు తెలుస్తుంది.