సినిమా వాళ్లకు అంకెలు, సంఖ్యల సెంటిమెంట్లు ఎక్కువ అంటుంటారు. ముహూర్తాలు, న్యూమరాలజీ బాగా పాటిస్తారు అని అంటుంటారు. వీటితోపాటు కంపారిజన్లు కూడా చాలా ఎక్కువే అని చెప్పాలి. అప్పుడు అలా చేస్తే ఇలా అయ్యింది కాబట్టి… ఇప్పుడు ఇలా చేస్తే అలా అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ కంపారిజన్ లెక్కలు సినిమా వాళ్ల నుండి వాళ్ల ఫ్యాన్స్‌కి కూడా వచ్చేస్తాయి. అలా ఓ డేట్ సెంటిమెంట్‌ను పట్టుకుని ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో అంచనాలు వేసేస్తున్నారు.
మహేష్‌బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్‌కి డేట్ ఇచ్చేశారు. ఇప్పటికే ముక్కలు ముక్కలుగా అటు ఇటుగా లీక్ అయిన పాటను నవంబరు 7న విడుదల చేస్తారు అని ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ను పట్టుకుని, సినిమా రిలీజ్ నేపథ్యాన్ని ముడిపెట్టి ఓ డిజాస్టర్ సినిమాతో కంపారిజన్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అలా ఎలా అంటార్రా బాబూ… ఆ విషయం వదిలేయండి, అయ్యిందేదో అయిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు.
త్రివిక్రమ్ సినిమాల్లో డిజాస్టర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా పేర్లలో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. ఆ సినిమాకు సంబంధించి తొలి పాటను ఆ ఏడాది నవంబరు 7న రిలీజ్ చేశారట. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమా పాటను కూడా అదే డేట్‌కి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నవే. దీంతో అప్పుడు ఆ టైమ్‌కి పాట వచ్చిన సినిమా పోయింది కాబట్టి… ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయానికొస్తే… ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసి, ఇంకెప్పుడో ప్రారంభించి, ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇన్నాళ్ల ఆలస్యం వల్లనేమో ఆ మధ్య సినిమా మీద బజ్ తగ్గిపోయింది. అయితే ఇప్పుడు తొలి పాటతో తిరిగి ఆ బజ్ తీసుకురావాలని సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.