“ఆష్టా చెమ్మా” లాంటి సూపర్ డూపర్ హిట్ అనంతరం దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ తో నాని-మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “జెంటిల్ మెన్”. నాని ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం కీలకాంశంగా రూపొందిన ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. మలయాళ ముద్దుగుమ్మలు నివేదా థామస్, సురభిలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం నేడు (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి హ్యాట్రిక్ హీరో నానికి “జెంటిల్ మెన్” సరికొత్త హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిందా ?
“బందిపోటు” లాంటి డిజాస్టర్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడిగా “జెంటిల్ మెన్”తో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలిగాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మా సమీక్షను తప్పకుండా చదవాల్సిందే..!!
కథ : కేతరీన్ (నివేదా) ఆఫీసు పనిమీద లండన్ నుంచి తిరిగివచ్చేసరికి తన బోయ్ ఫ్రెండ్ గౌతమ్ (నాని) ఓ కారు యాక్సిడెంట్ లో మరణించాడని తెలుసుకొంటుంది. అదే సమయంలో తనకు ఫ్లైట్ లో పరిచయమైన ఐశ్వర్య (సురభి) త్వరలో పెళ్లి చేసుకోబోయే జై (నాని) అచ్చుగుద్దినట్లు తాను ప్రేమించిన గౌతమ్ ను పోలి ఉండడం చూసి షాక్ అవుతుంది.
అసలు గౌతమ్, జై ఒకేలా ఎందుకున్నారు? వాళ్ళిద్దరూ ఒక్కరేనా? లేక ఇద్దరా?
గౌతమ్ హఠాన్మరణం వెనుక రహస్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధాన రూపమే “జెంటిల్ మెన్”
నటీనటుల పనితీరు : గౌతమ్, జై అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నాని అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా.. నివేథా థామస్ దగ్గర ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయే సన్నివేశంలో నాని పలికించిన హావభావాలను మెచ్చుకోకుండా ఉండలేము. కేతరీన్ గా నివేదా థామస్ నటన ఈ సినిమాకి హైలైట్. చాలా సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసే స్థాయిలో నటనపరంగా విజృభించింది.
సురభికి సినిమాలో పెద్దగా క్యారెక్టర్ లేకపోయినా.. అందంగా, బబ్లీగా కనిపించి ఆకట్టుకొంది. నిన్నమొన్నటివరకూ కామేడీ క్యారెక్టర్లలో అలరించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను సునాయాసంగా పోషించేశాడు. మిగిలిన పాత్రధారులంతా తమతమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆయన సమకూర్చిన నేపధ్య సంగీతం ప్రేక్షకులు సన్నివేశంలోకి లీనమవ్వడానికి తోడ్పడింది. పి.జి.విందా కెమెరా వర్క్ బాగుంది. కాకపోతే.. విషాదకర సన్నివేశాల్లో నటీనటులకు పెట్టిన టైట్ క్లోజ్ లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సీన్ టు సీన్ కనెక్టివిటీ కూడా అద్భుతంగా కుదిరింది.
సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ప్రతి ఫ్రెమూ చాలా రిచ్ గా కనిపిస్తుంది. డేవిడ్ నాధన్ సమకూర్చిన కథ బాగుంది. కానీ.. ట్విస్టులను రివీల్ చేసిన విధానం సెట్ అవ్వలేదు. అప్పటివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన కథనం, ఒక్కసారిగా మందగించడం మెయిన్ పాయింట్స్ లో ఒకటి.
దర్శకత్వం : దర్శకుడిగా, మాటల రచయితగా మోహనకృష్ణ ఇంద్రగంటి “జెంటిల్ మెన్” విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. అన్ని క్యారెక్టర్లను ఫస్టాఫ్ లోనే బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అందువల్ల సెకండాఫ్ డ్రామా నడిపించేప్పుడు ఎటువంటి సమస్యా తలెత్తలేదు. ముఖ్యంగా.. నాని క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ప్రశంసనీయం.
మొత్తానికి..
నాని మునుపటి సినిమాల స్థాయిలో లేకపోయినప్పటికీ.. సరదాగా ఒకసారి చూడదగ్గ చిత్రం “జెంటిల్ మెన్”.