ప్రముఖ యూట్యూబర్,నటుడు అయిన నిఖిల్ విజయేంద్ర సింహా అందరికీ సుపరిచితమే. ‘కాస్కో’ అనే షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నిఖిల్. సెలబ్రిటీలతో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ ఈ టాక్ షోని నిర్వహించేవాడు. ఇది చాలా పెద్ద సక్సెస్ సాధించింది. 4 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు నిఖిల్ విజయేంద్ర సింహా. యూత్ లో నిఖిల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇతను డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి 4 ఏళ్ళు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఇటీవల ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల్లో తన స్నేహితులైన వారికి పెద్ద పార్టీని కూడా ఎరేంజ్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ‘జీ5’ వారితో కలిసి నిహారిక నిర్మించిన ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ లో కూడా ఇతను కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా నిఖిల్ ఎవ్వరూ ఊహించని విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. వివరాల్లోకి వెళితే..75 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా’ కి గాను తెలుగు రాష్ట్రాల నుండి నిఖిల్ కు అవార్డు లభించింది.
‘మినిస్ట్రీ ఆఫ్ ఇండియా’ ఇతని పనితనాన్ని గుర్తించి అవార్డుని ఇచ్చి సత్కరించడం విశేషం. అంతేకాదు ఈ అవార్డుని గెలుచుకున్న 75 మందిలో నిఖిల్ ఒక్కడే తెలుగు వాడు కావడం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు నిఖిల్. ‘మన చేసే పనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఇది నాకు చాలా సంతోషంగా అదే విధంగా స్పెషల్ గా అనిపిస్తుంది.
ఇక నుండి జనాలు యూట్యూబర్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ల లను చూసే పద్ధతి, వారి గురించి ఆలోచించే పద్ధతి మారుతుంది అని నేను భావిస్తున్నాను. నన్ను ఇంతగా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ నిఖిల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా తను అవార్డు అందుకుంటున్న ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.