జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లే అయింది. తొలినాళ్లలో శ్రీదేవి (Sridevi) కూతురు అనే ట్యాగ్ లైన్ ఆమె వాడకపోయినా ఆమె చుట్టూ ఆ ట్యాగ్‌లైన్ తిరిగింది. అయితే సగటు కమర్షియల్ సినిమాలు కాకుండా, ప్రయోగాలు చేసుకుంటూ జాన్వీ అనే బ్రాండ్‌ను నెలకొల్పే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అందుకేనేమో ఆమెకు కమర్షియల్ విజయాలు అయితే రావడం లేదు. తాజాగా ఆమె చేసిన కొత్త సినిమా ‘ఉలఝ్’ ఫలితం కూడా దాదాపు ఇంతే అంటున్నారు.
జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) , రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఉలఝ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలుత మంచి టాకే వచ్చింది. జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే వసూళ్ల విషయంలో ఇబ్బంది కనిపిస్తోంది. కమర్షియల్‌గా సినిమా మిశ్రమ ఫలితమే అందుకుంది. తాజాగా ఈ విషయమై నటుడు గుల్షన్ దేవయ్య స్పందించాడు. ఇది సినిమాకు, జాన్వీకి కష్ట సమయమని కామెంట్ చేశాడు.
జాన్వీ సినిమా కష్టాల్లో ఉంది అంటూ పబ్లిష్ అయిన ఓ ఓ వార్తను షేర్ చేస్తూ పోరాటాలు విజయానికి నాంది అని అంటూ రాసుకొచ్చాడు. ఓటమి తర్వాత వచ్చే గెలుపు గొప్పగా ఉంటుంది. పోరాటాలను స్వీకరిస్తేనే ఆ తర్వాత వచ్చే విజయం విలువ తెలుస్తుంది అంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడాడు. అయితే ఆయన మాటల్లో నిజం ఉందని ప్రతి ఒక్కరూ అనేలా మాట్లాడాడు. అయితే ఆ వార్తలో చెప్పినట్లు ‘ఉలఝ్’ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా కష్టాల్లోనే ఉంది.
ఈ క్రమంలో కొంతమంది ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది అని కాస్త వెటకారంగా అంటే.. ఫీచర్ సినిమాలు బిగ్ స్క్రీన్‌లోనే చూడాలి అంటూ కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చాడు గుల్షన్. థియేటర్లలోనే అలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తారనేది గుల్షన్ వాదన. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే సినిమా ‘ఉలఝ్’ రూపొందింది. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.