కొంతమంది దర్శకులు తొలి సినిమాతో వేసిన ముద్ర అలా ఉండిపోతుంది. ఆ తర్వాత వాళ్లు ఏ సినిమా తీసినా వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలా కవితాత్మకత ఉన్న ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు హను రాఘవపూడి. ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా మారిన హను.. ఆ తర్వాతి సినిమాతో విజయం అందుకున్నా.. ఆ తర్వాతి వచ్చిన రెండు సినిమాలతో భారీ పరాజయాలను మూటగట్టుకున్నారు. ఆ సినిమాల ఫలితం గురించి ఆయన ఇటీవల మాట్లాడారు.
హను రాఘవపూడి రెండో సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’. ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో మీకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ లాంటి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల కాన్సెప్ట్‌లు బాగున్నా.. ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయాయి. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో కథనం పట్టుతప్పి సినిమా బోల్తాపడింది. ఎందుకిలా జరిగింది అని అడిగితే వివరంగా చెప్పారు హను రాఘవపూడి.
‘లై’ కానీ, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలకు సరైన ఫలితం దక్కకపోయినా, నిర్మాతలకు మాత్రం లాస్ రాలేదు అంటున్నారు హను. ఆ విషయం పక్కనపెడితే సినిమా విషయంలో తన అంచనా ఎలా తప్పిందో చెప్పారు. శర్వానంద్ – సాయిపల్లవి కాంబోలో వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో హీరోయిన్‌కు ఉన్న జబ్బును దాచి పెడితే, ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారని హను అనుకున్నారట. కానీ కానీ ప్రేక్షకులకు అది చూసి కోపం వచ్చింది. అందుకే సినిమా ఫలితం దెబ్బకొట్టింది అంటున్నారు.
అంతేకాదు ఆ సినిమా ఫలితం చూసి తనను అంటూ సెకండాఫ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటున్నారని, అయితే తాను కన్‌ఫ్యూజ్ కాలేదని చెప్పారు హను. ఇక నితిన్ – మేఘా ఆకాళ్‌ల ‘లై’ గురించి మాట్లాడుతూ.. సినిమా విషయంలో రెండు పెద్ద తప్పులు జరిగాయని చెప్పారు. ముందుగా అనుకున్న కథలో హీరో వెర్సస్ విలన్ పోరు మాత్రమే ఉంటుందట. అయితే కమర్షియల్ అంశాల కోసం హీరోయిన్ పాత్రను యాడ్ చేశారట. దాంతో సినిమాలో అసలు కథ డీవీయేట్ అయిపోయిందని చెప్పారు. దాంతో సినిమా స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. రషెష్ చూసి మార్పులు చేసుకునే అవకాశం కూడా దొరకలేదు అని చెప్పారు హను.