‘అందాల రాక్షసి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోలేదు కానీ, తన టేకింగ్ తో మాత్రం ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నాడు. తన రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ బాగానే ఆడింది. దీంతో అతనికి క్రేజ్ పెరిగింది. అయితే ‘లై’ ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. అయినా హను సినిమాలకి ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల విడుదలైన ‘సీతా రామం’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది.
ఇప్పటికీ దిగ్విజయంగా థియేటర్లలో రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హను.. ఓ ఇంటర్వ్యూలో తన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల ఫలితాలపై స్పందించాడు. హను రాఘవపూడి మాట్లాడుతూ.. ” ‘లై’ సినిమాని తీసిన ప్రాసెసె పెద్ద ఫెయిల్యూర్. ఏప్రిల్ 3న షూటింగ్ స్టార్ట్ చేశాం ఆగస్టు 11న సినిమా రిలీజ్. 4 నెలల్లో అలాంటి పెద్ద సినిమాను ప్లాన్ చేసుకోవడం…. యూ.ఎస్ కి వెళ్లడం, రావడం, ఇలా తిరగడానికే సరిపోయింది.
నేను ముందుగా అనుకున్న కథలో హీరోయిన్ ట్రాక్ లేదు. కానీ తర్వాత పెట్టాల్సి వచ్చింది. అలాగే ఆ సినిమా విషయంలో నేను చాలా తప్పులు చేశాను.ఒక తప్పు జరిగితే.. తర్వాత ఇంకా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఓ సందర్భంలో నేను ఆ సినిమాను చూసింది కూడా లేదు. ఆ బ్లేమ్ అంతా నేనే తీసుకుంటాను. ‘లై’ సినిమా చార్మ్ అంతా పోయింది. ‘పడి పడి లేచె మనసు’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
నేను ఏదైతే దాచేసి తర్వాత రివీల్ చేసానో..దాన్ని జనాలు ఫీల్ అవ్వలేదు. నన్ను తిట్టుకున్నారు. నేను ఆ సినిమాలో పెట్టిన కన్ఫ్యూజన్… డైరెక్టర్ కి ఉన్న కన్ఫ్యూజన్ అనుకున్నారు, క్యారెక్టర్ కు ఉన్న కన్ఫ్యూజన్ అనుకోలేదు. ఇక్కడ కూడా తప్పు నాదే. అందులో ఆ అమ్మాయికి(సాయి పల్లవి) ఉన్న ప్రాబ్లమ్ ముందుగా చెప్పేసి ఉంటే వర్కౌట్ అయ్యుండేదేమో” అంటూ చెప్పుకొచ్చాడు.