హిందూ ధర్మం, హిందూ మతం… అంటూ గత కొన్ని రోజులుగా ఏదో మూల చర్చ జరుగుతూనే ఉంది. దానిపై లోతుగా చర్చించే పరిస్థితి లేనప్పటికీ ఎందుకు దాని గురించి అంత చర్చ పెడుతున్నారు, ఏం సాధిస్తారు అనే ప్రశ్న చాలామంది మనసులో ఉండే ఉంటుంది. అంతెందుకు మీకు కూడా ఇలానే అనిపించి ఉండొచ్చు. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ విషయంలో కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఇష్యూ పెంచేలా కాదు… దీనికి ముగింపు పలికేలా ప్రయత్నం చేశారు.
హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు హరీశ్ శంకర్ మాట్లాడారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్ టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్ నిర్వహించాయి. దానికి ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణితోపాటు హరీశ్ శంకర్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే హిందూ ధర్మం, హిందూ మతం గురించి మాట్లాడారు.
హిందూ మతం బొట్టు పెట్టమని చెబుతుందని, హిందూ ధర్మం పక్కవారికి అన్నం పెట్టమని చెబుతుందని (Harish Shankar) హరీశ్ శంకర్ అన్నారు.
‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ ప్రాజెక్టు దైవ సంకల్పమని చెప్పిన ఆయన… దైవం, ధర్మం, మతం గురించి కూడా మాట్లాడారు. ఏదో కొంతమందికి అర్థం కానంత మాత్రాన దైవం లేదని కాదు, రూపం లేని వాడే భగవంతుడు అంటూ మాట్లాడారు. అలాగే సనాతన ధర్మాన్ని విమర్శించడం ఇటీవల ఎక్కువైందని ఆ కొంతమందికి కౌంటర్ వేశారు. భక్తి అనేది వ్యక్తిగతం, ధర్మాన్ని నమ్మేవారే గుడికి రావాలి అంటూ గట్టి పంచ్ వేశారు.
అలాగే సనాతన ధర్మంపై సెక్యులర్ ముసుగేసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆ కొంతమందికి క్లారిటీ ఇచ్చారు. మతం, సైన్స్ వేర్వేరు కాదని చెప్పిన హరీశ్ శంకర్… మతం, సిద్ధాంతం పుట్టిన తర్వాతే సైన్స్ పుట్టిందని, మతంలో ఓ భాగం సైన్స్ అని చెప్పుకొచ్చారు. చంద్రయాన్ చంద్రుణ్ని తాకకముందు తిరుపతికే వెళ్లింది. ఇస్రో కంటే ఇక్కడ ఎవరూ గొప్పవాళ్లు కాదు కదా అని ప్రశ్నించారు.