సీనియర్ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘శంకర్ దాదా జిందాబాద్’ ‘సంక్రాంతి’ ‘గోవిందుడు అందరి వాడేలే’ ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ… ‘అఖండ’ సినిమాలో చేసిన విలన్ రోల్.. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. పెద్ద సినిమాల్లో శ్రీకాంత్ కి అవకాశాలు రావడానికి కారణమైంది ‘అఖండ’ చిత్రం.
ప్రస్తుతం ‘దేవర’ ‘గేమ్ ఛేంజర్’ వంటి బడా సినిమాల్లో కూడా నటిస్తున్నారు శ్రీకాంత్. మరోపక్క అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. నవంబర్ 24 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు శ్రీకాంత్. ఇందులో భాగంగా ఆయన ‘కోట బొమ్మాళి పీ ఎస్’ తో పాటు ఆయన హీరోగా పోలీస్ క్యారెక్టర్స్ చేసిన సినిమాలను గుర్తుచేసుకున్నారు.
‘ఖడ్గం’ ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి సినిమాల్లో ఆయన పోలీస్ రోల్ చేశారు. అవి హిట్ అయ్యాయి. అలాగే ‘మెంటల్’ అనే సినిమాలో కూడా పోలీస్ పాత్ర పోషించారు శ్రీకాంత్. మొదట ఈ సినిమాకి ‘మెంటల్ పోలీస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్లు వదిలారు. తర్వాత పోలీసుల మనోభావాలు దెబ్బ తీసేలా టైటిల్ ఉందనే కాంట్రోవర్సీ అవ్వడంతో ‘మెంటల్’ గా టైటిల్ మార్చారు. కరణం పి బాబ్జి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యింది.
ఇక ఈ సినిమా ఫలితం గురించి తాజాగా (Srikanth) శ్రీకాంత్ స్పందించారు. ‘టైటిల్ కి తగ్గట్టే మెంటల్ మెంటల్ గా ఉంటుంది కాబట్టే.. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే యూట్యూబ్ లో మాత్రం ఆ సినిమాకు మంచి వ్యూయర్ షిప్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ను అక్కడి జనాలు బాగా చూశారు. నేను హీరోగా పోలీస్ రోల్ చేసిన సినిమా ప్లాప్ అయ్యింది అదొక్కటే. ‘కోట బొమ్మాళి పీఎస్’ అయితే తప్పకుండా నాకు మరో హిట్ ఇస్తుంది అనే నమ్మకం ఉంది’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.