కృష్ణ అల్లుడిగా, మహేష్‌బాబు బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్‌బాబు అనతికాలంలో ఆ ఇమేజ్ నుండి బయటపడేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. దీని కోసం బాలీవుడ్‌కి వెళ్లి విలన్‌గా కూడా నటించారు. అయితే ఇప్పటికీ సరైన విజయం అందుకోలేకపోతున్నారు. బాగా నటిస్తాడు, బాగా కనిపిస్తాడు అంటున్నారు కానీ.. సినిమా అదిరిపోయింది అని ఇటీవల కాలంలో ఆయన గురించి ఎవరూ అనుకోవడం లేదు. అయితే ఈ మాటను అనిపించుకోవడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో వస్తున్న సుధీర్‌బాబు.. ఈ రోజు ‘హరోం హర’ అనే సినిమాతో వచ్చడు. పీరియాడిక్ యాక్షన్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా గురించి మాట్లాడుతూ సుధీర్‌బాబు తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే సినిమా గురించి కీలక విషయాలు కూడా చెప్పారాయన. తన గత చిత్రాల్లో కొన్ని తప్పులు చేశానని, ఇందులో అలాంటి తప్పు ఒక్కటీ ఉండదని చెప్పారు.
1980ల నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ‘హరోం హర’. అప్పట్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్నారు. దర్శకుడు జ్ఞానసాగర్ తొలిసారి కలిసినప్పుడు ప్రేమకథ చెబుతాడేమో అనుకున్నానని, కానీ పీరియాడిక్ యాక్షన్ కథ వినిపించి షాక్‌కి గురి చేశాడు అని చెప్పారు. ఈ సినిమాలో పాత్రకు మ్యానరిజం ఉంటుందని, అలాగే పూర్తిగా కుప్పం యాసలో డైలాగ్స్ ఉంటాయని చెప్పారు. అలాగే ‘హరోం హర’కు సీక్వెల్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఫలితం బట్టి ఆలోచిస్తామని చెప్పారు.
నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి, డిఫరెంట్‌గా ఉండాలనే కోరుకుంటానని, ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాలు క్లిక్ అయితే.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. సినిమాలు పరాజయం పాలైనప్పటికీ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని తాను గట్టిగా నమ్ముతున్నానని అని చెప్పాడు సుధీర్‌బాబు. ప్రస్తుతం ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా చేస్తున్నాడు సుధీర్‌బాబు. దీంతోపాటు మరో రెండు సినిమాలు ఓకే చేశాడట.