చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అప్పట్లో తెలుగు సినిమాకి నాలుగు స్థంభాల్లా ఉండేవారు. సినిమాల పరంగా పోటీపడే వీరు తెలుగు నాట అతిపెద్ద పండుగైన సంక్రాంతికీ అదేవిధంగా తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ ని రణరంగంగా మార్చేసేవారు. ఇన్నేళ్ల తర్వాత చిరు మళ్ళీ రావడం, మిగిలిన ముగ్గురు సినిమాలు దాదాపు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లడం, యువహీరోలు కూడా బరిలో దిగడంతో 2017 సంక్రాంతికి బాక్సాఫీస్ మళ్ళీ కళకళ లాడుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడీ రేసు నుండి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారట.
చిరు ‘ఖైదీ నెం 150’, బాలయ్య ‘శాతకర్ణి’ విషయంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ నాగార్జున మాత్రం తాను నటిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాని వాయిదా వేసే యోచనలో ఉన్నారట. అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న ఈ భక్తి రస చిత్రాన్ని ఫిబ్రవరి 9 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉండటంతో రెండు వారాల్లోనే వసూళ్లు రాబట్టడమే లక్షయంగా మారినా ఈ కాలంలో ఇద్దరు అగ్ర హీరోల నడుమ తమ సినిమా విడుదల చేయటం నష్టానికి అవకాశం ఇచ్చినట్టే అని భావించి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎక్స్ప్రెస్ రాజా’గా తెరమీదికొచ్చిన యువ హీరో శర్వానంద్ కూడా ‘శతమానం భవతి’ సినిమాతో 2017 సంక్రాంతికి వస్తున్నట్టు ఆ మధ్య టీజర్ ద్వారా చెప్పుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వాయిదా వేద్దామని అంటున్నారట. ఇక సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ‘గురు’ రిలీజ్ మాట ఎత్తటం లేదుకానీ షూటింగ్ మాత్రం సూపర్ స్పీడ్ గా సాగిపోతుంది. డిసెంబర్ కి సినిమా రెడీ చేయాలన్నదే దగ్గుబాటివారి టార్గెట్. విడుదల ముహూర్తం సంక్రాంతి అవుతుందా మరోటి అనాది తెలిసేది అప్పుడే.