త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరపైకి వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన మార్కెట్ ను 200కోట్లకు పెంచుకున్నాడు. ఒక విధంగా పుష్ప సినిమాను వెండితెరపైకి తీసుకురావడానికి కూడా ఆ సినిమా ఎంతగానో హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ కూడా చాలా వరకు పెరిగింది. ఇక అలాంటి సినిమాను హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని గోల్డ్ మైన్స్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పుష్ప సినిమా హిందీలో భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ పాత సినిమాలను కూడా థియేటర్స్ లో విడుదల చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అల.. వైకుంఠపురములో.. డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థ థియేటర్లో విడుదల చేయాలని ఇటీవల విడుదల తేదీని కూడా ప్రకటించారు. జనవరి 26 వ తేదీన థియేట్రికల్ గా అల.. వైకుంఠపురములో సినిమాను హిందీ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదివరకే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది అల్లుఅరవింద్ భూషణ్ కుమార్ తో కలిసి రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ కృతిసనన్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి షెహజాదా అనే టైటిల్ కూడా సెట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ అల.. వైకుంఠపురములో సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేస్తుండడంతో రీమేక్ సినిమాపై ప్రభావం పడుతుంది అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఇక ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసే సర్వ హక్కులు కలిగిన గోల్డ్ మైన్స్ సంస్థకు అల్లు అరవింద్ 9 కోట్ల వరకు కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వారు ఆ ఆఫర్ పై పెద్దగా సంతృప్తి చెందలేదని టాక్ అయితే వస్తుంది. మరి ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ ను ఏ విధంగా ప్రణాళికలు రచిస్తారో చూడాలి.