సినిమా పరిశ్రమ కాంబినేషన్ల మీద, ట్రెండ్ మీదే నడుస్తోందనే విసయం మీకు తెలిసిందే. ఒక్కో సీజన్‌కు ఒక్కో రకం కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అని చెబుతారు. అయితే ఆ సీజన్ అయిపోయింది అని గ్రహించకపోతే తేడా కొట్టేస్తుంది. ఆ విషయం పక్కన పెట్టి అసలు మేటర్ చూస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయం పక్కా అని అనుకుంటున్న కాన్సెప్ట్ దేవుడి లీల. అవును భక్తుల మీద దేవుడు అనుగ్రహించి తన మహిమలు, లీలలు చూపిస్తే ఆ సినిమా విజయం పక్కా అని చెప్పాలి. అయితే దేవుడి మీద సినిమా చేస్తే తేడా ఫలితం వస్తోంది.
పైన చెప్పిందంతా ‘మిరాయ్’ సినిమా వచ్చి భారీ విజయం అందుకున్న నేపథ్యంలోనే అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫాంటసీ ప్రపంచం, దైవత్వం కలసి రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయమే అందుకుంది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అశోకుడి తొమ్మిది పుస్తకాలు, శ్రీరాముడి అస్త్రాన్ని నేపథ్యంగా తీసుకుని కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాకు ముందు కూడా ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.
రీసెంట్ నుండి పాస్ట్‌కి లిస్ట్ చూస్తే తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ ‘హను – మాన్’ సినిమాను చెప్పుకోవాలి. ఆంజనేయుడు భువికి వచ్చి తన లీలను చూపిస్తాడు. ఇక నిఖిల్ – చందు మొండేటి కలసి ‘కార్తికేయ’ సినమాలు రెండు చేశారు. తొలిసారి సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తే.. రెండో సినిమాలో కృష్ణుడి లీలలు చూపించారు. ఇప్పుడు మూడో ‘కార్తికేయ’ కోసం కథ సిద్ధమవుతోంది. అదీ ఇ లానే ఉంటుంది. ఇక చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో హనుమంతుడి పాత్ర కీలకం అని చెబుతున్నారు.
సుదీర్ బాబు ‘జటాధర’ సినిమాలో ఈశ్వరుడిని సరికొత్తగా ఆవిష్కరించారు. మోహాన్ లాల్ ‘వృషభ’ సినిమాలో శివుడి కృపను చూస్తామట. నభా నటేశ్ ‘నాగబంధం’ సినిమాలో అనంత పద్మనాభస్వామి అంశం కీలకమట. నిఖిల్ ‘స్వయంభు’ సినిమాలో శతాబ్ధాల నాటి చరిత్ర చూపిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే దేవుడి లీల.. ఇప్పుడు హిట్ టాపిక్ అనిపించడం లేదు.