చిన్న నిర్మాణ సంస్థగా ప్రారంభించి.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ప్రొడక్షన్ హౌస్‌గా మారిపోయింది హోంబలే ఫిలింస్. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ నుండి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్ ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అలా ఈ టీమ్ నుండి ఇప్పుడు రెండు సినిమాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఆ రెండింటి గురించి ఇటీవల నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో శాండిల్ వుడ్ ఫ్యాన్స్ ఫుల్‌జోష్‌లో ఉన్నారు.
పదుల కోట్లతో రూపొందిన ఓ సినిమా వందల కోట్లు వసూళ్లు సాధిస్తుంది అంటే నమ్మొచ్చా. మొన్నీమధ్య వరకు పెద్దగా నమ్మలేం కానీ.. ‘కాంతార’ వచ్చాక కచ్చితంగా నమ్మాలి. అలాగే ఓ స్టార్ సినిమాగా మొదలై.. మొత్తం దేశాన్ని శాండిల్ వుడ్ వైపు చూసింది అంటే అది ‘కేజీయఫ్’తోనే సాధ్యమైంది. ఇప్పుడు ఈ సినిమాల సీక్వెల్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటి గురించి హోంబలే నిర్మాతలు విజయ్ కిరగందూర్, చాలువే గౌడ చెప్పారు.
‘కాంతార’కి సీక్వెల్ సినిమా నిర్మించే ఆలోచన ఉందని.. కాకపోతే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నాం. రిషబ్ శెట్టి కూడా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటానన్నారు. ఆయన సిద్ధమయ్యాక ఫ్రాంఛైజీ సినిమా గురించి పనులు ప్రారంభిస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం అని చెప్పారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించడంతో పాటు రాబోయే ఐదేళ్లలో రూ.3 వేల కోట్లు చిత్ర పరిశ్రమలో పెట్టుబడిగా పెడతాం అని కూడా చెప్పారు.
దేశంలో రాబోయే రోజుల్లో వినోద పరిశ్రమ మరింత వృద్ధి చెందబోతోంది. ఏటా కనీసం ఐదారు చిత్రాలు మా బ్యానర్‌లో తీసుకొస్తాం. అందులో ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని చెప్పారు. కన్నడలో ప్రారంభించిన తాము.. మొత్తం దక్షిణాది భాషల్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం అని హోంబలే నిర్మాతలు తెలిపారు. అలాగే హిందీపైన కూడా దృష్టి పెడతాం అని తెలిపారు.
ఇక ‘కేజీయఫ్ 3’ గురించి మాట్లాడుతూ ‘సలార్’ సినిమా పూర్తయ్యాక ‘కేజీయఫ్-3’పై ప్రశాంత్ నీల్ దృష్టి పెడతారని తెలిపారు. ఆ సినిమా గురించి ప్రశాంత్ దగ్గర ఇప్పటికే స్టోరీ లైన్ ఉందని, వచ్చే ఏడాది గానీ, ఆ మరుసటి సంవత్సం కానీ… సినిమా స్టార్ట్ అవుతుందని తెలిపారు.