గత ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఫీట్.. వచ్చే ఏడాది దిల్ రాజు చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. రావడం పక్కా అని మన ఫిల్మీ ఫోకస్‌లో చదివే ఉంటారు కూడా. అనుకున్నట్లుగానే రెండు సినిమాలను సంక్రాంతి సీజన్‌కి లైన్‌లో పెట్టేశారు దిల్ రాజు(Dil Raju) . ఈ క్రమంలో ఓ ప్రశ్న కొత్తగా వినిపిస్తోంది. అదే రెండు సినిమాల మధ్య గ్యాప్ ఎంత?. దీనికి సమాధానం దిల్ రాజు టీమ్ దగ్గర కూడా లేనట్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య ఎక్కువగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. థియేటర్లు అంటే ఇక్కడ స్క్రీన్లు కూడా వస్తాయి. వచ్చే సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణ సంస్థ నుండి రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) .. వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెడీ అయ్యాయి. రెండో సినిమా రిలీజ్ సీజన్ ఈ రోజే ఫిక్స్ చేశారు. కానీ డేట్ చెప్పలేదు. దీంతోనే వాళ్లకు ఆ డౌట్ ఉందని అర్థమవుతోంది.
డిసెంబరులో వస్తాం, క్రిస్‌మస్‌కి వస్తాం అని పక్కాగా చెప్పిన దిల్ రాజు రెండు నెలల ముందే ‘గేమ్ ఛేంజర్’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా జనవరి 10న వస్తాం అని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో సంక్రాంతి వార్‌లో ఫస్ట్ ఎంట్రీ చరణ్‌దే అని అంటున్నారు. ఆ లెక్కన వెంకీ సినిమాను మూడు రోజుల తర్వాత తీసుకొస్తారు అని తెలుస్తోంది. కుదిరితే పొంగల్ సీజన్‌లో ఆఖరి రోజున రావాలని చూస్తున్నారట.
అయితే.. ఈ లెక్క మరో రెండు సినిమాల మీద ఆధారపడి ఉంది అని అంటున్నారు. సంక్రాంతి సీజన్‌లో బాలయ్య – బాబి సినిమా ఉండటం పక్కా అని తేలుతోంది. ఇక మైత్రీ వాళ్ల అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా పొంగల్ పోరులోనే ఉంది. నాగచైతన్య (Naga Chaitanya) – చందు మొండేటి (Chandoo Mondeti) ‘తండేల్’ (Thandel) కూడా అప్పుడే వస్తుంది అని అంటున్నారు. వీటి లెక్క ప్రకారం వెంకీ సినిమా సంగతి తేలుతుంది అని అంటున్నారు.