మట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి అని పెద్దలు చెప్పారు. అయితే సమస్య ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటే సమస్యలు తీరుతాయి తప్ప… సమస్య గురించి మీడియా ముందు మాట్లాడితే సమస్యలు తీరవు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల సమస్య గురించే మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. అయితే ఈ విషయం ఇంకా సినిమా వాళ్లకు అర్థం కాలేదా? పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఒకవేళ అనిపించకపోయుంటే ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి చేసిన పని చూశాకైనా అర్థమవ్వాలి. అప్పటికీ లేదంటే కష్టమే.
సినిమా టికెట్ల గురించి ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో ఆర్.నారాయణమూర్తి స్పందించారు. థియేటర్లు మూసేస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు. దీని గురించి ఏ ఒక్కరో, ఇద్దరో మాట్లాడితే పని అవ్వదని… అహం వీడి సినిమా పరిశ్రమ కోసం అందరూ ముందుకు రావాలని కూడా కోరారు. దానికి ముందు అడుగుగా తనే వచ్చారు కూడా. ఏపీ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించడానికి అమరావతి వెళ్లి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడారు. ఆ తర్వాత థియేటర్ల యజమానులు, ప్రదర్శనకారులతో సమావేశం జరిగింది.
ఈ క్రమంలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగింది అని చెప్పొచ్చు. మూసేసిన థియేటర్లు తిరిగి తెరుచుకోవచ్చని, నెల రోజుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది థియేటర్ల యజమానులకు తేల్చి చెప్పింది. దీంతో వాళ్లు ఇప్పుడు థియేటర్లు తెరుచుకునే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే థియేటర్ల సమస్య ఉన్న వాళ్లు తెరవడం లేదు. పట్టణాలు, నగరాలకు దగ్గరలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో నిర్మించి మల్టీప్లెక్స్‌లకే ఈ సమస్య. థియేటర్ ఉన్న ప్రాంతం గ్రామం కావడంతో అక్కడి రేట్లు పెట్టాల్సి వస్తోంది.
అదే ఆ మల్టీప్లెక్స్ నగరంలో ఉంటే ధర వేరేగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓకే ఇదంతా పక్కన పెడదాం. ముందు రోజు ఓ ఈవెంట్‌లో మాట్లాడి… రెండో ఏపీ ప్రభుత్వ ప్రతినిధితో మాట్లాడారు ఆర్.నారాయణమూర్తి. మరిదే పని మిగిలిన హీరోలు ఎందుకు చేయడం లేదు, చేయలేకపోయారు. ఇదే మాట మనం నానిని కూడా అడగొచ్చు. రేపొద్దున సినిమాల రిలీజ్‌లు ఉన్న పెద్ద హీరోలను కూడా అడగొచ్చు. పరిశ్రమ మీద ప్రేమ లేక వాళ్లు ముందుకు రావడం లేదా? లేక మేమెందుకు వెళ్లాలి అనుకుంటున్నారా? అనేది ఆ హీరోలే చెప్పాలి.