ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవో విడుదలైంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలు వైఎస్ జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పేశారు. కొత్త ధరల గురించి ఇప్పుడు ఏపీలో తెగ చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే చాలా తేడా కనిపిస్తోంది అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అదే రూ. 100 కోట్ల బడ్జెట్ కాన్సెప్ట్. హీరో, డైరక్టర్ రెమ్యూనరేషన్ మినహాయించి ఆ సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు ఉంటే దాని టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.
అయితే ఇక్కడే సమస్య వచ్చింది. ఈ లెక్కలు ఎలా, ఎవరు వేస్తారు. సినిమాల బడ్జెట్… ఈ లెక్కల గురించి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏం రాసినా అన్నీ సమాచారాలే. సినిమాలు ఏమీ నీటి పారుదల ప్రాజెక్టులు కావు. దీనికింత, దానికింత అని లెక్కలు రాసుకొని తీయడానికి. సినిమాల నిర్మాణంలో లెక్కకు సులభంగా చూపించేగలిగే ఖర్చులు ఉండవు. చిన్న చిన్న ఖర్చులు కలిపి ఎక్కువవుతాయి. ఈ సమయంలో బడ్జెట్‌ను పక్కగా లెక్కించడం ఎలా అనేది ఇక్కడ విషయం.
మరోవైపు తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ ఖర్చు రాసి మా సినిమాకు హీరో, డైరక్టర్ల రెమ్యూనరేషన్ తీసేస్తే రూ. వంద కోట్లు అయ్యింది అంటే ఇబ్బందే. అదీ కాకుండా పెద్ద హీరోలు, దర్శకులు ఏవైనా చిన్న సినిమాలు చేసినప్పుడు ఇంకో సమస్య వస్తుంది. సినిమా కోసం నిర్మాత రెమ్యూనరేషన్లకే ఎక్కువ పెట్టి… సినిమా నిర్మాణానికి తక్కువ పెడతారు. అలాంటప్పుడు సినిమా నిర్మాణానిక రూ. వంద కోట్లు అవ్వదు. దీంతో ఆ సినిమా పెద్దది కాదు అంటూ టికెట్ ధరలు పెంచే అవకాశం లేదంటే ఎలా? ఎందుకంటే ఆ సినిమాకు మొత్తం ఖర్చు చాలా ఎక్కువే అవుతుంది.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచనను చాలామంది తప్పుపడుతున్నారు. సినిమా బడ్జెట్‌లో దర్శకుడు, హీరో రెమ్యూనరేషన్ లెక్క కట్టం అంటే ఎలా అని అడుగుతున్నారు. అసలు ఇదేం లాజిక్ అని అడుగుతున్నారు. దీనిపై నిర్మాతలు, హీరోలు, దర్శకులు మరోసారి మాట్లాడుకొని ప్రభుత్వాన్ని సంప్రదించాలి. లేదంటే బడ్జెట్ లెక్కలు తేలక ప్రత్యేక ధరల నిర్ణయం ఇబ్బందుల్లో పడుతుంది. అలాగే తక్కువ ఖర్చు చేసి, ఎక్కువ లెక్క చెప్పేవాళ్లు పెరిగితే అసలుకే మోసం వస్తుంది.