వరుసగా భారీ చిత్రాల భారీ విజయాలతో మాంచి ఊపు మీదుంది బాలీవుడ్. గతేడాది దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే వందల కోట్ల వసూళ్ల సినిమాల జాబితాలో బాలీవుడ్ సినిమాలే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాదిని కూడా అలానే కొనసాగిద్దాం అని బాలీవుడ్ అనుకుంటోంది. ఈ క్రమంలో తొలి సినిమాగా ‘ఫైటర్’ సినిమా సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా విషయంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను కొన్ని దేశాల్లో రిలీజ్ చేయడం లేదని సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరో (Hrithik Roshan) హృతిక్ రోషన్ – స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన చిత్రం ‘ఫైటర్’. దేశభక్తి అనే అంశంతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయాల్సి ఉంది. గతంలో హృతిక్ – సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చిన ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాలు భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి ‘వార్ 2’ను హ్యాట్రిక్ సినిమా చేయాలనేది అభిమానుల కోరిక.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాను ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల్లో బ్యాన్ చేస్తున్నారట. అంటే అక్కడ సినిమా రిలీజ్ ఉండదు అని అంటున్నారు. అయితే ఒక్క యూఏఈలో మాత్రమే మాత్రమే సినిమా విడుదల చేస్తున్నారని టాక్. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, అందుకే ఆయా దేశాలు సినిమాపై నిషేధం విధించాయని అంటున్నారు.
అయితే ఈ విషయంలో చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాను హాలీవుడ్ మూవీ స్థాయిలో తెరకెక్కించారు అని టీమ్ ఇప్పటికే అంటోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాను మన దేశంలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా అందుబాటులో ఉండదు.