దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీరిలీజ్ బిజినెస్ ను కొన్ని రోజుల క్రితం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భాషల వారీగా.. ప్రాంతాల వారీగా థియేట్రికల్ బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేవలం 5 భాషలకు సంబంధించి రూ.348 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దాదాపు సినిమా బడ్జెట్ తో సమానం.
తెలుగు-హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఒకేరోజు 11 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సమయం దొరికితే ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి విడుదల చేస్తే కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోపక్క నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. శాటిలైట్, డిజిటల్, ఆడియోతో పాటు ఇతర హక్కులన్నీ కలిపి దాదాపు రూ.250 కోట్ల బిజినెస్ జరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.
డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, స్టార్ మా లాంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కడా డీల్ ఫైనల్ కాలేదు. మరో వారం లేదా పది రోజుల్లో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం రూ.700 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.