గతేడాది గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కొద్దిపాటి ఓపెనింగ్స్ సాధించి బిలో యావరేజ్ అనిపించుకుంది. అంతకు ముందు గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా బాగానే ఉన్నా.. అది కూడా బ్రేక్ ఈవెన్ కాకుండా హిట్ అనే పదానికి అడుగు దూరంలో ఆగిపోయింది. గోపీచంద్ చివరిగా హిట్టు కొట్టింది 2014 లో వచ్చిన ‘లౌక్యం’ చిత్రంతో..! అంటే గోపి హిట్టు కొట్టి 9 ఏళ్ళు కావస్తుందన్న మాట.
త్వరలో గోపీచంద్ ‘రామ బాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను కూడా ‘లౌక్యం’ దర్శకుడు అయిన శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ‘రామ బాణం’ చిత్రంలో గోపీచంద్ పాత్రను పరిచయం చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ వదిలారు. ఇందులో గోపీచంద్.. విక్కీ అనే పాత్రను పోషిస్తున్నాడు. గోపీచంద్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్. దానిని బేస్ చేసుకునే ఈ గ్లింప్స్ ని వదిలారు. ఇది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలకు లేని బిజినెస్ ఈ సినిమాకి జరుగుతుంది. అందుతున్న సమాచారం రామబాణం చిత్రానికి రూ.20 కోట్ల సాలిడ్ బిజినెస్ జరిగిందట. ‘పక్కా కమర్షియల్’ చిత్రం ‘గీతా ఆర్ట్స్’ వంటి బడా సంస్థ నిర్మించిన సినిమా కాబట్టి.. దానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ‘రామ బాణం’ చిత్రానికి అంత బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.
గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు ‘లక్ష్యం’ రూ.14 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే.. ‘లౌక్యం’ మూవీ రూ.23 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. పైగా ‘రామ బాణం’ ని మంచి ఫామ్లో ఉన్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు నిర్మిస్తున్నారు. కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగిందని స్పష్టమవుతుంది.