ఈ మధ్య కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని మార్కెట్ చేసుకోవడం.. రిలీజ్ చేయడం మరింత కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా ఓటీటీ డీల్ సెట్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. సినిమాలో పేరున్న నటీనటులు ఉండాలి. కంటెంట్లో కూడా కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఓటీటీ సంస్థలు బల్క్ లో డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
లేదు అంటే రెవెన్యూ షేరింగ్ లో ఇచ్చుకోవాల్సిందే. అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి, రెవెన్యూ జనరేట్ అయ్యే వరకు నిర్మాత ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాల్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పాలి. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరి వద్ద ఈ బ్యానర్ ఇచ్చిన అడ్వాన్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ బ్యానర్లో వాళ్ళు సినిమాలు చేయాల్సిందే. పక్క భాషల్లో కూడా వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఆల్రెడీ హిందీలో ‘జాట్’ చేశారు. అది సేఫ్ ప్రాజెక్టే. తర్వాత తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చేశారు. అది కూడా లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తో ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇది రూ.35 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ‘డ్రాగన్’ కంటే ముందే సెట్ చేసుకున్న ప్రాజెక్టు ఇది. మామితా బైజు ఇందులో హీరోయిన్. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ ఓటీటీ రైట్స్ రూపంలో సగం పైనే రికవరీ జరిగిందట.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డ్యూడ్’ సినిమా డిజిటల్ రైట్స్ ని(అన్ని భాషల్లోనూ కలుపుకుని) రూ.25 కోట్లకు కొనుగోలు చేశారట. అంటే 70 శాతం రికవరీ సాధించినట్టే. థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి.’లవ్ టుడే’ ‘డ్రాగన్’ సినిమాలతో ప్రదీప్ (Pradeep Ranganathan) కి తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజ్ ఉంది. సో ఈ ప్రాజెక్టు రూపంలో మైత్రి వారికి భారీ లాభాలు మిగిలినట్టే అని చెప్పాలి.