ఎంతోమంది వెండితెరపై వెలిగిపోవాలని కొన్నేళ్లుగా స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. తమ ఫోటోలు, వీడియోలను దర్శకనిర్మాతలకు ఇచ్చి అవకాశాల కోసం అడుగుతుంటారు. కానీ కొంతమందికే అవకాశం లభిస్తుంది. ఇలా ఏ స్టూడియోల చుట్టూ తిరగక ముందే అనుష్క హీరోయిన్ గా అవకాశం అందుకుంది. నటన గురించి ఎటువంటి అవగాహనా లేకపోయినప్పటికీ దర్శకులు చెప్పినట్టు నటిస్తూ మెల్లగా అడుగులు వేసిన ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలోని గొప్ప నటీమణుల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అరుంధతి, దేవసేన (బాహుబలి), రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది. అయినా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుండా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. భవిష్యత్తు గురించి ఏమి ప్లాన్ చేసారని ఆమెను అడగగా ఆశ్చర్యపోయే సమాధానం చెప్పింది.
”అసలు భవిష్యత్ గురించి ఆలోచనే రాదు. ఈ రోజు ఏంటనేదే నాకు ముఖ్యం. మరీ ఎక్కువ ముందు చూపుతో ఆలోచిస్తే మనసులో తెలియని ఒత్తిడి మొదలైపోతుంటుంది. అందుకే నా సామర్థ్యం ఇంతే అనుకొని ఆ రోజు గురించే ఆలోచిస్తా. వృత్తి పరంగా కూడా ‘ఫలానా సమయంలో అలాంటి కథని ఎంపిక చేసుకోవాలి, ఇన్నేళ్లకి ఇది చేయాలంటూ లెక్కలేసుకొని పనిచేయడం నాకు నచ్చదు. నేనెప్పుడు ఏం చేయాలో కాలానికే బాగా తెలుసని నమ్ముతాను”అని వేదాంతి ధోరణిలో అనుష్క చెప్పింది. దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తుంటే అనుష్క మాత్రం దేవాలయాల చుట్టూ తిరుగుతోంది. భాగమతి తర్వాతి ఆమె చేయబోయే సినిమా ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.