మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంద్ర’. 2002 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు.’మృగరాజు’ ‘శ్రీమంజునాథ’ ‘డాడీ’ వంటి చిత్రాలు నిరాశపరచడంతో ‘ఇంద్ర’ పై మొదట పెద్దగా అంచనాలు ఏమీ నమోదు కాలేదు. కానీ ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం… అటు తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది. 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది ‘ఇంద్ర’ చిత్రం.
మెగాస్టార్ కెరీర్ లో మొట్టమొదటి ఫ్యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ చిరుకి మళ్ళీ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం సెకండ్ హాఫ్ చాలా వరకు చిరునే డైరెక్ట్ చేశారట. వర్షం కురవడానికి యజ్ఞం చేసే సీన్, రిజర్వాయిర్ కోసం చిరు ఆస్తులు త్యాగం చేసే సీన్లు చిరునే డైరెక్ట్ చేశారట. మే నెలలో భయంకరమైన ఎండలు ఉన్నప్పటికీ చిరు.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్ చేశారట. ఈ క్రమంలో యూనిట్ సభ్యులకు, చిన్న ఆర్టిస్ట్ లకు ఇబ్బంది కలిగించినందుకు ఆయన వెళ్లి క్షమాపణలు కూడా చెప్పారట.
‘మీరు ఇలా షూటింగ్ చేస్తేనే మేము భోజనం చేయగలం సార్. మీరు చేసిందాంట్లో తప్పమి లేదు. మేమె మీకు థాంక్స్ చెప్పాలి’ అంటూ చిరుని ప్రశంసించారట అక్కడి యూనిట్ సభ్యులు, ఆర్టిస్ట్ లు. ఇక సెకండ్ హాఫ్ లెంగ్త్ చాలా ఎక్కువైతే పరుచూరి బ్రదర్స్ కలిసి ఎడిటింగ్ రూంలో కూర్చొని కత్తెరకు పనిచెప్పారట చిరు. ఇలా ‘ఇంద్ర’ మూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.