తెలుగులో ‘దసరా’(Dasara) ‘దేవర’ (Devara) వంటి సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నటుడు, కొన్ని రోజులుగా అనుచిత ప్రవర్తన, డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అతడిపై విమర్శలు గుప్పించగా, తాజాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) స్పందిస్తూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.
షైన్‌పై గతంలోనూ మహిళలపై వేదింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి చర్యలు మళ్లి చర్చనీయాంశమవడంతో ఫెడరేషన్ అతడికి చివరి అవకాశం ఇచ్చింది. ఇకపై ఏ విధమైన అసభ్యకర ప్రవర్తనకు పాల్పడినా, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపితమైతే కచ్చితంగా సినిమా పరిశ్రమ నుండి బహిష్కరిస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇది ఈయన కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. తన ప్రతిభకు, నటనకు గుర్తింపు ఉన్నప్పటికీ వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు లేకపోతే పరిశ్రమలో కొనసాగడం సాధ్యపడదని సినీ ప్రముఖులే చెబుతున్నారు.
ఒక్కటి రెండు అవకాశాలు వచ్చాయన్నదే గానీ, నిర్మాతలు, దర్శకులు నిరంతరం షైన్‌పై నమ్మకాన్ని కొనసాగించలేరు. షూటింగ్‌కు డేట్లు ఇవ్వకుండా గైర్హాజరు కావడం, సహనటీనటులతో అనుచితంగా ప్రవర్తించడం వంటి వ్యవహారాలపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే కేవలం నటన మాత్రమే కాదు, ప్రవర్తనలోనూ ఒక డిసిప్లిన్ అవసరం. నటుడు ఎవరైనా కూడా, ఎదుటివారిని గౌరవించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి.
ఫెడరేషన్ చేసిన ఈ హెచ్చరికతో షైన్ టామ్ చాకో ఇకనైనా మారతాడా లేక మరోసారి అదే తప్పు చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన ‘దేవర’ 2లో విలన్‌గా కనిపించబోతున్న నేపథ్యంలో, ఈ విషయాలు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి షైన్ టామ్ చాకోకు ఇది చివరి అవకాశం అన్నది స్పష్టం. ఈసారి అయినా తన ప్రవర్తనను సరిచేసుకుంటే, ఇండస్ట్రీలో ఒక స్థిరమైన స్థానం ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే నటన ఎంత గొప్పగా ఉన్నా, అవకాశాలు మాత్రం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.