పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆయన తన ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక దగ్గర తన ఆలోచనల్ని నింపుతుంటారు. ముఖ్యంగా దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలనే తపనని పాటల రూపంలో చెబుతుంటారు. తప్పు చేసిన నాయకుడిని ప్రశ్నించాలి, న్యాయం కోసం ఎంతటి వాడినైనా ఎదిరించాలి.. అనే విప్లవ భావజాలం కూడా కొన్ని పాటల్లో కనిపిస్తుంది. అటువంటి పవన్ పాటలపై ఫోకస్..
ఐ యామ్ యాన్ ఇండియన్ (బద్రి)
పవన్ కళ్యాణ్ ప్రేమ కథ చిత్రాల్లో బద్రి కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం పవన్ కి కాలేజీ కుర్రోళ్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. కారణం అద్భుతమైన లవ్ స్టోరీతో పాటు ఇందులో “ఐ యామ్ యాన్ ఇండియన్” పాటకు అందరూ కనెక్ట్ అయ్యారు. భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలి, మన భరతమాతకు హాని చేసేవారిని అంతమొందించాలని.. ఈ పాట ద్వారా పవన్ చెప్పిన విధానం అందరికీ నచ్చింది.
ఏ మేర జహ (ఖుషి)
ఖుషి సినిమాలో మరో దేశభక్తి పాటతో పవన్ ఆకట్టుకున్నారు. ఇందులోని ఏ మేర జహ పాట పూర్తిగా హిందీలో ఉన్నప్పటికీ .. పవన్ హావభావాల ద్వారా అందరికీ అర్ధమయింది. పక్కా లవ్ స్టోరీలో దేశభక్తి పాటను పెట్టినా కూడా యువత ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశారు.
నారాజు గాకురా మా అన్నయ్య (జానీ)
దేశంలో మత ఘర్షణలు వద్దంటూ హిందూ, ముస్లింలు కలిసి మెలసి ఉండాలని జానీ సినిమాలోని “నారాజు గాకురా మా అన్నయ్య” పాట ద్వారా పవన్ చెప్పారు. అంతేకాదు కులాలు పేరు చెప్పుకొని నేతలయ్యే వారి మాటలను నమ్మవద్దని కూడా హెచ్చరించారు. జానీ హిట్ కాలేక పోయినా సందేశం నిండిన ఈ పాట మాత్రం సూపర్ హిట్ అయింది.
లె లె లేలే (గుడుంబా శంకర్)
పవన్ ఆలోచనలు నిరంతం ప్రజల చుట్టూ ఉంటాయనడానికి నిదర్శనం గుడుంబా శంకర్ లోని “లె లె లేలే” పాట. ఇందులోని ప్రతి పదం ఓ పాఠంలా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. “అవునంటే ఆకల్లే… లేకుంటే బాకల్లే,” “నీరల్లే పారాలి.. అందరి దాహం తీర్చాలి.. అణిచేస్తే ముంచేయాలి లే.. అనే పదాలు చైతన్యాన్ని కలిగించాయి.
ఇంతే ఇంతింతే ( బాలు )
ప్రతి ఒక్కరూ దేశం బాగుకోసం కష్టపడాలని బాలు సినిమాలో “ఇంతే ఇంతింతే” పాట ద్వారా పిలుపునిచ్చారు. ఓ వైపు జీవితం గురించి చెబుతూనే.. మనుషుల్లో మంచోడు ఎవరో ముంచేవాడు ఎవరో మనసెట్టి చూడాలంతే అంటూ సూచించారు. “దేశాన్ని శోకం నుంచి చీకటిని నుంచి రక్షించే సైనికుడవ్వాలి ” అంటూ యువకులను తట్టిలేపారు.
చలోరే చలోరే చల్ (జల్సా)
విప్లవ సాహిత్యానికి కూడా కమర్షియల్ టచ్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కే సాధ్యమయింది. జల్సాలోని చలోరే చలోరే చల్ ని పరిశీలిస్తే పూర్తిగా వామపక్ష భావజాలం కనిపిస్తుంది. “ఏ సమరం ఎవరితో తేల్చుకో ముందుగా”.. యుగయుగాలుగా మృగాలకన్నా ఎక్కువగా ఏమి ఎదిగాం.. అనే మాటలు వాటి యువతని ఆత్మ పరిశీలన చేసుకోమని పవన్ స్పష్టం చేశారు.
తలదించుకు బ్రతుకుతావా (కెమెరా మెన్ గంగ తో రాంబాబు)
కెమెరా మెన్ గంగ తో రాంబాబు సినిమా మొత్తం రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగుతుంది. అనేక సీన్లు కోతకు కూడా గురయ్యాయి. ఇందులో “తలదించుకు బ్రతుకుతావా” అనే పాట శ్రీ శ్రీ రచనల్ని గుర్తుకు తెస్తుంది. యువతలో చైతన్యాన్ని రగిలిస్తుంది.
పవన్ పాటల్లో దేశభక్తి ఉంది కాబట్టి ఆ పాటలను “ఏపీ స్పెషల్ స్టేటస్” కోసం జనసేన నిర్వహించిన సభ కోసం రీ మిక్స్ చేసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.