నందమూరి బాలకృష్ణ (Balakrishna) అంటే నట విశ్వరూపం అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ.. ఆయన తొలి నాళ్ల నుండి అలానే ఉన్నారు. తొలి సినిమా ‘తాతమ్మ కల’ (Tatamma Kala) చేసినప్పుడే ఆ విషయాన్ని మన సీనియర్లు చెప్పారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు పూర్తవుతోంది. అంటే బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా? నందమూరి తారక రామారావు (Sr NTR) స్వీయ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’ సినిమాను తెరకెక్కించారు.
బాలకృష్ణకు బాలనటుడిగా ఇదే తొలి సినిమా. డేరింగ్ అండ్ డ్యాషింగ్‌కి మారు పేరు అయిన.. ఎన్టీఆర్ అప్పటి ప్రభుత్వ ఆలోచనా ధోరణికి భిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. దీంతో ఆ రోజుల్లో ఈ సినిమా విడుదలకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. రెండు నెలల పాటు సినిమా నిషేధం విధించారు కూడా. ఈ సినిమా 1974లో స్టార్ట్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది.
‘ఇద్దరు ముద్దు ఆపై వద్దు’ అని నినాదంగా తీసుకొని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయితే ఎన్టీఆర్ పరిమిత సంతానానికి వ్యతిరేకం. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదని ఆయన అంటుండేవారు. ఎన్టీఆర్ ఆలోచనకు తగ్గట్టు రచయిత డి.వి నరసరాజు ‘తాతమ్మ కల’ (Tatamma Kala) కథ సిద్ధం చేయగా.. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ ఆ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో తాతమ్మ కల నెరవేర్చే మునిమనవడిగా బాలకృష్ణ.. ఇక వ్యసనపరుడిగా హరికృష్ణ (Hari Krishna) నటించారు. సినిమా షూటింగ్ పూర్తయినా అప్పటి పరిస్థితుల వల్ల కథ విషయమై సెన్సార్ దగ్గర ఆగిపోయింది. దీంతో సినిమా మీద రెండు నెలల నిషేధం విధించారు. అసెంబ్లీలోనూ అప్పట్లో ఈ సినిమా గురించి చర్చలు జరిగినట్లు చెబుతుంటారు. అయితే ఆ అడ్డంకులన్నీ దాటుకుని ఆగస్టు 30, 1974న సినిమా విడుదలైంది.